త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నానంటు ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ రోజుకో వార్తతో వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో నోట్ల రద్దును సమర్ధిస్తూ మోడీకి సెల్యూట్ చేసిన కమల్ తప్పైంది క్షమించండి అంటూ పశ్చాతాపాన్ని వ్యక్తం చేశాడు. ఓ తమిళ పత్రికకు మహా క్షమాపణ పేరుతో వ్యాసాన్ని రాసిన కమల్…కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత, దాని అమలులో ఉన్నసమస్యలను తాను తెలుసుకున్నానని పేర్కొన్నారు.
చేసిన తప్పును అంగీకరించడం, దానిని సరిదిద్దుకోవడం ఓ రాజ నీతిజ్ఞుడి లక్షణమని అతను అన్నాడు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులకు చాలా కష్టాలు ఎదురయ్యాయని, అనుకున్న ఫలితాలు రాలేదని చెప్పారు. కేవలం ధనవంతుల కోసం మాత్రమే మోదీ నోట్లురద్దు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దుతో కేవలం రాజకీయ నాయకులకు లబ్ది జరిగిందే తప్ప సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు.
మోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రజలెంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తుంటే బాధేస్తుందన్నారు. దీనిపై కామ్రేడ్ నాయకులు, మిత్రులు ముందే తనని హెచ్చరించారని, అయినా వారిమాట పెడచెవిన పెట్టి మోదీకి మద్దతిచ్చి తప్పుచేశానని కమల్ హాసన్ అన్నారు.
అయితే రెండు నెలల కిందటే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్.. కచ్చితంగా బీజేపీలో మాత్రం చేరను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోట్ల రద్దును సమర్థించడం తప్పే అని అంగీకరించడం గమనార్హం.