ఇళయదళపతి విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్సల్’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందే రూ.160 కోట్ల బిజినెస్ సాధించగా విడుదలైన తొలిరోజే రూ. 31 కోట్ల వసూళ్లను రాబట్టింది. అంతేగాదు ఓవర్సిస్‌లోనూ మెర్సల్ సునామీ ఆగట్లేదు. తెలుగులో ఈ నెల 27న విడుదలవనుంది.
ఓ వైపు రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తున్న ఈ సినిమాపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని చేపట్టిన కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నిరసన తెలుపుతుండగా తాజాగా తమిళ వైద్యులు సినిమాను బహిస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే హీరో విజయ్‌కు, సినిమాకు మరో అగ్రనాయకుడు కమల్‌హాసన్ మద్దతుగా నిలిచారు. సినిమా సెన్సార్ పూర్తైన తర్వాత వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాలను తీసేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. వ్యవస్థపై సరైన రీతిలో విమర్శలు చేయడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియా పై దర్శకుడు రాసిన డైలాగ్‌లు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. సినిమాలో సింగపూర్, భారత్‌లో అమలవుతున్న మెడికల్ ట్యాక్స్‌లపై ప్రశ్నలు సంధించాడు. సింగపూర్‌లో 7శాతం జీఎస్టీ వసూలు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యమందిస్తుంటే ఇండియాలో మాత్రం 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా ఉచిత వైద్యం మాత్రం అందడం లేదన్నారు. అంతేకాదు హాస్పిటల్‌కు వెళితే ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరకడం లేదంటూ డైలాగ్‌లు పేల్చారు. ఆరోగ్యానికి హానికరమైన మద్యంపైన మాత్రం జీఎస్టీ వేయలేదని పంచ్‌లు విసిరారు. ఇవే ఇప్పుడు బీజేపీకి కోపం తెప్పించాయి.