ప్రముఖ నటుడు కమల్‌హాసన్ చిత్ర పరిశ్రమపై 28శాతం జీఎస్టీ పన్ను విధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ పన్ను విధానం సినీ పరిశ్రమకు అమిత భారంగా మారతుందని ఇప్పటికే పలువురు సినీ నిర్మాతలు అంటున్నారు. ఈ విషయంలో వారు ప్రభుత్వ పెద్దలకు పరిస్థితిని వివరిస్తున్నారు.
ఈ క్రమంలోనే కమల్ హాసన్ కూడా స్పందించారు. 28 శాతం పన్ను విధిస్తే ప్రాంతీయ సినిమాలకు తీవ్రమైన నష్టాలు వస్తాయని.. వాటిని తట్టుకుని నిలబడి సినిమాలు తీయడం సాధ్యం కాదని, తనలాంటి వాళ్లు సినిమాలు తీయడాన్ని మానుకోవడమే పరిష్కారం అవుతుందని కమల్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా సినిమాలపై జీఎస్టీ పన్ను తగ్గించకపోతే తాను చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ అంశంపై చెన్నైలోని ఫిల్మ్‌ఛాంబర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన..ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
‘జీఎస్టీ విధానాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ప్రాంతీయ చిత్రాలకు, అంతర్జాతీయ చిత్రాలకు ఒకే విధమైన పన్ను విధించడం సరికాదు. ప్రాంతీయ, చిన్న సినిమాలే దేశీయ సినిమాకు బలం. అలాంటప్పుడు అధిక పన్నులు విధిస్తే.. పరిశ్రమ నష్టపోతుంది. ఈ విధానాన్ని నేను ఒప్పుకోను. జీఎస్టీ రేటును 12 లేదా 15 శాతానికి తగ్గించకపోతే సినిమాల నుంచి తప్పుకుంటాను. నేను ప్రభుత్వ ప్రతినిధిని కాదు.. సినీ పరిశ్రమ తరఫున పనిచేస్తున్నాను’ అని కమల్‌హాసన్ అన్నారు.
చిన్న సినిమాలపై భారీగా పన్నులు విధించడం ఏంటనీ.. ఇదేమైనా ఈస్ట్‌ఇండియా కంపెనీనా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీఎస్టీ ఈ విధానం కింద 5,12,18,28 శ్రేణుల్లో వస్తు, సేవల పన్ను ఉంటుంది. ఇప్పటికే అనేక రంగాలకు పన్నులను కేటాయించిన ప్రభుత్వం.. బంగారం తదితర కీలక రంగాలకు నేడు పన్ను స్లాబులను నిర్ణయించనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ ఒకే పన్ను విధానం జులై 1 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.