కమల్‌..మక్కళ్‌ నీది మయ్యమ్‌

234
Kamal Haasan calls his party 'Makkal Needhi Maiam'
- Advertisement -

అవినీతి రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడమే నా అభిమతం అని కమల్‌ హాసన్ స్పష్టం చేశారు. మధురైలోని ఒత్తకడై మైదానంలో ‘మక్కళ్‌ నీది మయ్యమ్‌’ (జస్టిస్‌ ఫర్‌ పీపుల్‌) పేరుతో పార్టీని ప్రారంభించిన కమల్ జెండాను ఆవిష్కరించారు. తెలుపు రంగు జెండాలో ఎరుపు, నలుపు రంగు మిళితమైన ఉన్న జెండాను తన పార్టీ జెండాగా కమల్‌ ఆవిష్కరించారు. చేయి చేయి కలిపి ఉన్నట్లు ఈ జెండాలో ప్రధానంగా కనిపిస్తోంది.

పార్టీ ఏర్పాటు తనకు ఎన్నో ఏళ్ల లక్ష్యమన్నారు. ఇది మీ పార్టీ. ప్రజల పార్టీ. నేను ఇందులో ఓ భాగం మాత్రమే. ఇక్కడకు వచ్చిన చాలా మంది నాయకుల ముఖాలను నేను చూశాను. ఇక్కడికి వచ్చింది నేను మీరు చెప్పేది వినడానికి. మీకు నేనేదో చెప్పడానికి కాదు. ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదు. ప్రజల నుంచి సలహాలు తీసుకునే వ్యక్తిని. ఈ ఒక్కరోజుతోనే కార్యక్రమం ఆగిపోదు. నేను నాయకుడిని కాదు.. ప్రజల చేతిలో ఉపకరణాన్ని. మీకు సేవ చేసేలా నన్ను మార్గదర్శనం చేయండి. నేడు రాష్ట్రం అవినీతితో రగిలిపోతోంది. నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. మీ సలహాలు తీసుకునేందుకు వచ్చానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యఅతిథిగా హాజరుకాగా కేరళ సీఎం పినరయి విజయన్ వీడియో సందేశంలో కమల్‌కు విషెస్ చెప్పారు. కొత్త పార్టీ పేరును కమల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. maiam.com పేరుతో తన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఇదే పేరుతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌లోను ఖాతాలను తెరిచారు. కొత్త పార్టీని పెట్టినందుకుగాను పలువురు వేదికపైకి వచ్చి కమల్‌కు అభినందనలు తెలిపారు. వేదికపైకి వచ్చిన వారందరినీ కమల్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని నవ్వుతూ పలకరించారు.

- Advertisement -