ఆకట్టుకుంటున్న ‘ఎంత మంచివాడ‌వురా’ వీడియో సాంగ్..

88
Kalyanram

“ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం.. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం..“ అని అంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల సుబ్ర‌మ‌ణ్యం ఈ పాట‌ల‌ను ఆల‌పించారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ బ్యూటీఫుల్ ట్యూన్‌కి ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ “ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ అంద‌మైన కుటుంబ క‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియ జేసే చిత్రమిది. అలాంటి కంటెంట్‌ను సూచించేలాగానే ఈ రోజు విడుద‌లైన సాంగ్ `ఏమో ఏమో ఏ గుండెల్లో ..` ఉంది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగారు ఎక్స‌లెంట్‌గా పాడిన ఈ పాటకు రామ‌జోగయ్య‌గారు అమేజింగ్ లిరిక్స్ రాశారు. పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే మ‌ర్నిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది“ అన్నారు.

Emo Emo Ye Gundello Lyrical | Entha Manchivaadavuraa | Kalyan Ram | Sathish Vegesna | Gopi Sundar