కాళోజీ జయంతి….తెలంగాణ భాషా దినోత్సవం

207
kaloji

తెలంగాణ భాషా దినోత్సవం
కాళోజీ నారాయణరావు
(9.9.1914-13.11.2002)

తల్లిదండ్రులు: రమాబాయమ్మ, రంగారావు.

వీరి పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావురాంరాజా కాళోజీ. కాళోజీ కుటుంబం కర్నాటక రాష్ట్రం బీజాపూరు నుంచి వరంగల్ జిల్లాకు తరలి వచ్చి మడికొండ గ్రామంలో స్థిర పడింది. 1939లో హైదరాబాదులోని న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందాడు. నిజాంనిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. ప్రజల భాషలో రాయ బడిన “నా గొడవ” అనే వీరి కవితా సంపుటి 12-1-1953న తొలిసారి ఆవిష్కరింపబడింది. “ఇదీ నా గొడవ” (1995) అనేది వీరి ఆత్మకథ. కథలు కూడా రాశాడు. “జీవన గీత” (1968) పేరుతో ఖలీల్ జిబ్రాన్ రాసిన “దప్రాఫేట్” ను అనువదించాడు. 1958-60 శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వహించాడు. 1992లో “పద్మభూషణ్”తో భారత ప్రభుత్వం సత్కరించింది.

కాకతీయ విశ్వవిద్యాలయం 1992లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. “అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక!” అన్నాడు కాళోజీ.జయప్రకాశ్ నారాయణ్ మరణించినప్పుడు “పుటుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది!” అని కాళోజీ నివాళి అర్పించాడు. పౌర హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నాడు. అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా జీవితాంతం గొంతెత్తినినదించారు.

౼సేకరణ :-“తారీఖుల్లో తెలంగాణ”
-ప్రచురణ:- తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ

కాళోజీ సాహిత్యం-కొన్ని కవితా పంక్తులు:

 “అన్యాయాన్నెదిరిస్తే
  నా గొడవకు సంతృప్తి
  అన్యాయం అంతరిస్తే
  నా గొడవకు ముక్తిప్రాప్తి
  అన్యాయాన్నెదిరించినోడు
   నాకు ఆరాధ్యుడు”         

“ఏ భాషనీది ఏమి వేషమురా ?
ఈ భాష ఈ వేష మెవరికోసమురా
ఆంగ్లమందున మాటలా గలుగగనే
ఇంతగా గుల్కెదవు ఎందుకొసమురా?.........”

 “అన్య భాషలు నేర్చి
 ఆంధ్రమ్ము రాదంచు
 సకిలించు ఆంధ్రుడా! 
 చావవెందుకురా ?”

“అవనిపై జరిగేటి అవకతవకలు చూచి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
పరుల కష్టము చూచి పగిలిపోవును గుండె
మాయ మోసము చూచి మండిపోవును ఒళ్ళు
పతిత మానవు జూచి చితికి పోవును మనసు
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు.”

సామాన్య ప్రజలనుద్దేశించి వేమన చెప్పినట్లు సామాజిక వ్యత్యాసాలను చాలా అలవోకగా ప్రజల భాషలో కవితాన్ని రాసిన కాళోజీ:

” పది వుపన్యాసాలు చేయలేని పని ఒక వ్యాసం చేస్తది . పదివ్యాసాలు చేయలేని పని ఒక కథ చేస్తది . పదికథలు చేయలేని పని ఒక కవిత చేస్తది . పది కవితలు చేయలేని పని ఒక పాట చేస్తది . అందుకే నేను నాగొడవ రూపంలో కవిత్వాన్ని నా భావజాల వ్యాప్తికి ఎన్నుకున్న ” అన్నడు .

” అన్న పురాసులు ఒకచోట
ఆకలిమంటలు ఒకచోట
సంపదలన్ని ఒకచోట
గంపెడు బలిగం ఒకచోట “

అన్న ఈసంగతిని ఎంత అల్కగా చెప్తడంటే

” కమ్మని చకినాలొక చోట
గట్టి దవడలు ఇంకొక చోట ” .

” బతుకు తప్పదు బతక్క తప్పదు .
శాస్త్రం తప్పుతుంది .
ధర్మం తప్పుతుంది .
న్యాయం తప్పుతుంది గాని
బతుకు తప్పదు , బ్రతక్క తప్పదు ” అన్న కాళోజీ .

‘నా గొడవ ‘ కవితా సంపుటిని నేటి తరం తప్పకుండా చదివి తెలుసుకోదగ్గ అపురూప గ్రంధం .