ఆగస్టు మొదటివారంలోగా సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు అందేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం నీటి విడుదలపై ఆరు జిల్లాల ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జగదీష్..ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆస్తుల పరిరక్షణ అధికారులపై ఉందన్నారు.
కాళేశ్వరం నీరు పారుతున్న చివరి గ్రామం పెన్ పహాడ్ మండలం చిన్న సీతారాం తండా అని అన్నారు. చివరి గ్రామానికి నీరు చేరడంతో ముందెన్నడూ లేని పంట పండిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు.
కాలువల నిర్వహణతో పాటు చివరివరకు నీళ్లు అందించే బాధ్యత అధికారులదేనని సూచించారు. చివరి భూములకు నీరు చేరడానికి 20 రోజులు పడుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నీటి విడుదల ప్రణాళిక ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.