చారిత్రక ఘట్టం…ముస్తాబైన గోదావరి తీరం

520
cm kcr kaleshwaram
- Advertisement -

తెలంగాణ ప్రజలకు నేడు పండుగ రోజు. రైతులతో పాటు యావత్ దేశం ఆసక్తిగా ఎదరుచూస్తుండగా మరికొద్దిగంటల్లో తెలంగాణ యవనికపై మహా జలదృశ్యం ఆవిష్కారమవుతున్నది. గోదారమ్మ గొంతును తడిపే కాళేశ్వరం ప్రాజెక్టును ఉదయం 10.30 గంటలకు జాతికి అంకితం చేయనున్నారు సీఎం కేసీఆర్. గవర్నర్ నరసింహన్‌తో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్,ఏపీ సీఎం జగన్‌ ఈ అద్భుతఘట్టం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద మహా ఘట్టానికి సన్నాహాలు పూర్తయ్యాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడంతోపాటు మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద హోమా లు నిర్వహించాలని సంకల్పించడంతో ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం సంబురాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేశారు టీఆర్ఎస్ నేతలు.

శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు ఎర్రవెల్లి గ్రామం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ చేరుకొంటారు సీఎం కేసీఆర్. 7.50 గంటలకు సీఎం జగన్‌,మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉదయం 8 గంటలకు నాందేడ్ విమానాశ్రయం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకొని అక్కడినుంచి మేడిగడ్డ బరాజ్‌కు వెళ్తారు.

ఉదయం 8.30 గంటలకు మేడిగడ్డ బరాజ్ వద్ద నిర్వహించే పూజాకార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఉదయం 10.50 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల ద్వారా నీటి విడుదల చేస్తారు. అనంతరం అతిథులతోకలిసి డెలివరీ సిస్టర్న్ వద్దకు వెళ్లి గోదావరిజలాలు పైపుల ద్వారా ఎగిసిపడే దృశ్యాల్ని వీక్షిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లిలోనే సీఎం కేసీఆర్ అతిథులతో కలిసి భోజనంచేస్తారు. ప్రారంభోత్సవంలో భాగంగా కాళేశ్వరం పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా అతిథులు వీక్షిస్తారు. తెలంగాణ రైతు దశాబ్దాల నీటి గోస తీరుతున్న ఆ క్షణం కోసం రైతాంగమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

- Advertisement -