ఖైదీ నంబర్ 150 మూవీతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది కాజల్ అగర్వాల్. ఇప్పుడు మళ్ళీ అజిత్ నటిస్తున్న ‘వివేగం’ లోను.. విజయ్ మూవీలోను.. అలాగే తేజ దర్శకత్వంలో రానా సరసన చేస్తోంది. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించాక బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కాజల్. అయితే కొన్ని సినిమాలలో నటించినా.. సౌత్ ఫిల్మ్స్ లో వచ్చినంత గుర్తింపులో కొంత కూడా దక్కలేదు. అందుకే తనను స్టార్ గా గుర్తించిన చేసిన సౌత్ సినిమాలపై ఇప్పుడు ఫోకస్ చేసింది. అందుకే కావచ్చు తన ప్రాంతీయత విషయంలో మాట మార్చేసింది కాజల్ అగర్వాల్.
పొరపాటున ఉత్తరాదిన జన్మించాను అని, దక్షిణాదిన తనకు లభించిన ఆదరణ ను చూస్తుంటే తను ఇక్కడే జన్మించి ఉండాల్సిందని కాజల్ అభిప్రాయపడింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వెనుకటికి తను ఉత్తరాదికి చెందిన దాన్ని అని గర్విస్తానని కాజల్ చెప్పింది. ఏదో దక్షిణాది సినిమాలను చేస్తున్నాను కానీ, తను ఉత్తరాదిన పుట్టిన దానిగా గర్విస్తానని కాజల్ అప్పట్లో చెప్పుకొచ్చింది. హిందీ సినిమాల కోసం ఇక్కడ మంచి ఆఫర్లను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు సినిమా జీవితం ఇచ్చింది తెలుగు తమిళ్ సినిమాలే కదా.. నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే నా స్వస్థలం’ అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది కాజల్. బాలీవుడ్‌లో ఆఫర్లు లేవు కాబట్టి ఇప్పుడు మాత్రం ప్లేటు ఫిరాయించిందీమె. ఒకవేళ మళ్లీ మంచి ఛాన్స్ వచ్చి బాలీవుడ్ వెళ్లినపుడు.. ‘నేను ఇక్కడే పుట్టా.. నేను లోకల్’ అనేస్తుందో చూడాలి మరి..