మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటుపై కడియం కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో గిరిజన వర్సిటీ, ట్రిపుల్ ఐటీ సహా పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలోని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా 2019-2020 విద్యా సంవత్సరానికి ములుగు జిల్లా కేంద్రంగా గిరిజన విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించాలని కడియం మంత్రిని కోరారు.
సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కడియం.. రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తున్నా.. గిరిజన విశ్వ విద్యాలయం ప్రారంభం మాత్రం ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రంగా ప్రారంభం కానున్న గిరిజన విశ్వవిద్యాలయంలో సూపర్ న్యూమరిక్ సీట్లను ఏర్పాటు చేసి స్థానిక గిరిజనులకు మేలు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని ఆయన తెలిపారు.
దీంతో 2019-2020 విద్యా సంవత్సరానికి గిరిజన యూనివర్సిటీ ప్రారంభమవుతుందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టమైన హామీ ఇచ్చారని కడియం వెల్లడించారు. సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ని విద్యా సంస్థల ఏర్పాటుపై పలుమార్లు విజ్ఞప్తి చేశామని, అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నూతన విద్యా సంస్థల ఏర్పాటులో కొంత ఆలసత్వం ప్రదర్శిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జవహార్ నవోదయ విద్యాలయాలు, 13 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు. కడియంతో పాటు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరైయ్యారు.