సినిమా పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు.. విధి వెక్కిరించి.. కాలం పగబట్టి వివిధ కారణాలతో ఆనారోగ్యం పాలై ఆపదలో ఉండి సాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరో అభాగ్యులను అండగా తానున్నానంటూ ముందుకు వచ్చి అన్నార్థుల సహాయార్ధం కోసం మనం సైతం సంస్థను స్థాపించారు నటుడు కాదంబరి కిరణ్. ఈ సంస్థ ఇంతింతై.. వటుడింతై అన్న తీరుగా దిన దిన ప్రవర్ధమానం చెందుతూ ఎందరో అభాగ్యులకు ధీమాగా నిలుస్తోంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఎంతో మందికి మనం సైతం సంస్థ చేయూతనిచ్చింది. ఈ సంస్థ చేస్తున్న పనికి తమ వంతుగా సాయమందిస్తామంటూ ఇప్పటికే ఎంతో మంది సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.తాజాగా ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో మనం సైతం సంస్థకు మరికొంత మంది సినీ ప్రముఖులు తమ వంతు సాయాన్ని అందించారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన వంతు సాయంగా 50వేల రూపాయలను మనం సైతం సంస్ధకు అందజేశారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ పరిశ్రమలో మంచి మనుషులు పెరుగుతూనే ఉన్నారని, పేదరికాన్ని రూపుమాపకున్నా వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలనేదే నా ధ్యైయం, లక్ష్యం. గతేడాది నేను విజ్ఞప్తి చేసి బతిమాలితే వివిధ ఆస్పత్రుల నుంచి 43 లక్షల రూపాయల బిల్లులు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికి 90 మందికి సహాయం చేశాం. పరిశ్రమలో చిరంజీవి, కృష్ణ గారి దగ్గర నుంచి ఎంతోమంది మనం సైతంకు చేయూత నిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్, కేటీఆర్ తో కలిసి పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాం. కానీ ఇటీవల కొన్ని సంఘటనలు జరగడం వల్ల అది ప్రస్తుతానికి వాయిదా వేశాం. ప్రభుత్వం నుంచి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేటీఆర్ సహకారంతో దాదాపు 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకు అందించామని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకురాలు నందినీ రెడ్డి, నటుడు రాజీవ్ కనకాల, నటి రజిత, డాన్స్ మాస్టర్ సత్య, గాయని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.