అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా ప్రఖ్యాత ప్రపంచ శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధినేత డా. కేఏ పాల్ ఆధ్వర్యంలో ‘గ్లోబల్ పీస్ అండ్ ఎకనమిక్ సమ్మిట్’ (Global Peace & Economic Summit) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మానవత్వాన్ని కాపాడటం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు.
ఈ చారిత్రాత్మక సదస్సుకు అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ మైక్ జాన్సన్ (Mike Johnson) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన పలు దేశాల నేతలు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు మరియు వివిధ మతాలకు చెందిన ప్రముఖ మతపెద్దలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా ప్రత్యక్ష-పరోక్ష జోక్యాలు మరియు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 చిన్న, పెద్ద యుద్ధాలను తక్షణమే ఆపివేయడమే ఈ సదస్సు ప్రధాన ఎజెండాగా చర్చించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న 197 దేశాల్లోని దాదాపు 800 కోట్ల జనాభాపై ఈ యుద్ధాల వల్ల ఆహార, ఆర్థిక, ప్రాణ నష్టాలు మరియు ద్రవ్యోల్బణం రూపంలో తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని సదస్సులో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ మతపెద్దలు మాట్లాడుతూ.. సరిహద్దులు, విభేదాలు పక్కనబెట్టి మానవాళి మనుగడకు, శాంతిభద్రతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Also Read:దానం నాగేందర్‌కు సుప్రీంలో షాక్
సమకాలీన ప్రపంచంలో తుపాకులు, క్షిపణుల కంటే శాంతియుత చర్చలు, ఆర్థిక సహకారమే మానవత్వాన్ని కాపాడగలవని డా. కేఏ పాల్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ సమ్మిట్ ప్రపంచ దేశాల అధినేతల్లో తీవ్ర ఆలోచనను రేకెత్తిస్తుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

