గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రజాధనం వృథా!

5
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇప్పటికే HILT స్కాం విషయంలో హైకోర్టును ఆశ్రయించిన పాల్, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంపై మరో 17 కేసులు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.

మీడియాతో మాట్లాడిన ఆయన, గత రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తన అధికారాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగించకపోగా, భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయినందుకు వెంటనే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (HILT) స్కాం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 9,300 ఎకరాల విలువైన భూములను అమ్మేసి రూ. 5 లక్షల కోట్ల అవినీతికి పూనుకున్నదని పాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశానని, త్వరలో అన్ని ఆధారాలతో మరిన్ని కేసులు కూడా దాఖలు చేయనున్నానని చెప్పారు.

అంతేకాక, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని వృథా చేస్తోందని కేఏ పాల్ మండిపడ్డారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో, రంగాల్లో దోపిడీ చేసిన వ్యక్తులే ఈ సమ్మిట్‌కు వస్తున్నారనీ, ప్రజల డబ్బుతో విలాసవంతమైన ఈవెంట్ ఏర్పాటు చేయడం పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని, ప్రజలకు ఏ ఒక్క ప్రయోజనం కలగలేదని కేఏ పాల్ విమర్శించారు. రాబోయే రోజుల్లో అన్ని అవినీతి వ్యవహారాలను బహిర్గతం చేసి, రాష్ట్ర ప్రభుత్వ భ్రష్టాచార పాలనను బయటపెడతానని ఆయన హెచ్చరించారు.

Also Read:MSG:ట్రెండింగ్‌లో శశిరేఖ సాంగ్

- Advertisement -