సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. నిర్ణీత లక్ష్యాల సాధన దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని, ముఖ్యంగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు. ఈ దిశగా వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం, సామాజిక సంక్షేమం వంటి ప్రతి విభాగంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని గవర్నర్ తెలిపారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోబెల్ బహుమతి విజేత కైలాష్ సత్యార్థి ప్రశంసల వర్షం కురిపించారు. యువ ముఖ్యమంత్రి రెండేళ్ల వ్యవధిలోనే అద్భుతమైన మార్పులు తీసుకువచ్చారని ఆయన అభినందించారు. ముఖ్యంగా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేయడం, రైతు కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయమని పేర్కొన్నారు.
అదేవిధంగా మహిళలు, బాలికల కోసం ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయడం ఒక సామాజిక విప్లవంలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మహిళల విద్య, ఉపాధి, భద్రతపై సానుకూల ప్రభావం చూపుతుందని సత్యార్థి తెలిపారు. అలాగే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు జరుగుతున్న చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాఠశాలలు, కళాశాలల సంస్కరణలు, నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చే కృషి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని ఆయన అభినందించారు.
Also Read:గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రజాధనం వృథా!

