ప్రముఖ సీనీ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు విశ్వనాథ్ ను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.కాగా, సినీ రంగానికి, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.
భారతీయ చలనచిత్ర అభివృద్ధికి కృషి చేసినందుకు గాను విశ్వనాథ్ ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కింద ఆయనకు స్వర్ణ కమలాన్ని బహూకరిస్తారు. దీంతో పాటు పది లక్షల నగదును ఇస్తారు. శాలువాతో సత్కరిస్తారు. సాంప్రదాయ సంగీతం, నృత్యం వంటి కళలను సినిమాల్లో విశ్వనాథ్ చక్కగా చిత్రీకరించారు. 1965 నుంచి విశ్వనాథ్ సుమారు 50 చిత్రాలకు డైరక్షన్ చేశారు. సామాజిక, మావవీయ సమస్యలపై అనేక చిత్రాలను ఆయన రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో 1930లో జన్మించారు. ఆర్ట్, మ్యూజిక్, డాన్స్ థీమ్ లతో అనేక చిత్రాలను తీశారు. 1992లో ఆయన పద్మశ్రీ అందకున్నారు. అయిదుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిల్మ్ కేటగిరీలో 20 నంది అవార్డులు గెలుచుకున్నారు. పదిసార్లు ఫిల్మ్ అవార్డు కూడా గెలిచారు. విశ్వనాథ్ రూపొందించిన స్వాతిముత్యం చిత్రం 59వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ క్యాటగిరీలో పోటీపడింది. చాలా సున్నితమైన అంశాలను విశ్వనాథ్ తన చిత్రాల ద్వారా ఆసక్తికరంగా చూపించారు.
ఇదిలా ఉండగా, సప్తపది, శంకరాభరణం,సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, సిరివెన్నల వంటిఎన్నో ఉత్తమ చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అలాంటి చిత్రాల్లో సీనిక్ బ్యూటీ, మ్యూజిక్, పవర్ ఫుల్ క్యారెక్టర్లతో విశ్వనాథ్ చిత్రాలను రూపొందించడంలో సిద్దహస్తుడు. ఆయన సినిమాల్లో కథ కదనాలకు ఎంతో ప్రధాన్యం ఉంటుంది.