భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజీఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్టప్రతి భవన్‌లో ఆయనకు ప్రమాణం చేయించారు. 65 ఏళ్ల వయస్సు పూర్తిచేసుకుని ఆదివారం పదవి వీడిన భూషణ్ ఆర్. గవాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
హర్యానాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన న్యాయమూర్తి సూర్యకాంత్, ఒక చిన్న పట్టణ న్యాయవాదిగా ప్రారంభించి దేశ అత్యున్నత న్యాయ పదవికి చేరుకున్నారు. ఆయన రాజ్యాంగ సంబంధిత మరియు జాతీయ ప్రాధాన్యమున్న అనేక తీర్పుల్లో భాగమయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ఆధారంగా, పదవి విడిచిన సీజీఐ గవాయ్ సీనియారిటీ సాంప్రదాయాన్ని అనుసరించి చేసిన సిఫారసు మేరకు రాష్ట్రపతి సూర్యకాంత్‌ను నియమించారు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్ ప్రత్యేక హోదా తొలగింపు, బీహార్‌లో ఓటర్ల జాబితా పునర్విమర్శ (SIR), పెగాసస్ గూఢచారి సాఫ్ట్‌వేర్ కేసు వంటి అనేక కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. అక్టోబర్ 30న ఆయనను తదుపరి సీజీఐగా నియమించగా, దాదాపు 15 నెలలపాటు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు. 2027 ఫిబ్రవరి 9న 65 ఏళ్ల వయసులో పదవి నుంచి విరమిస్తారు.
2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్స్ ఇన్ లా)లో ‘ఫస్ట్ క్లాస్ ఫస్ట్’ సాధించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.పంజాబ్–హర్యానా హైకోర్ట్‌లో అనేక ముఖ్య తీర్పులను రచించిన ఆయన, 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన ఆర్టికల్ 370, మాట స్వేచ్ఛ, పౌర హక్కులపై ముఖ్య తీర్పుల్లో భాగమయ్యారు.
రాష్ట్రపతి, గవర్నర్‌కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఉన్న అధికారాల గురించి వచ్చిన తాజా రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో కూడా ఆయన భాగమే. ఈ తీర్పు అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read:రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
ముఖ్య తీర్పులు
రక్షణ దళాల్లో ‘వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ (OROP) పథకాన్ని ఆయన రాజ్యాంగబద్ధంగా సరైనదిగా నిలబెట్టారు.
శాశ్వత కమీషన్‌పై సమాన హక్కుల కోసం పోరాడుతున్న మహిళా అధికారుల పిటిషన్లను ఆయన ఇంకా విచారిస్తున్నారు.
1967లో వచ్చిన AMU తీర్పును రద్దు చేసిన ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో ఆయన భాగమయ్యారు, దీతో విద్యాసంస్థ మైనారిటీ హోదా మీద తిరిగి చర్చకు అవకాశం ఏర్పడింది.

