కన్నప్రేమ కర్కశంగా మారుతున్నది. తండ్రి అంటే పిల్లలపై కొండంత ప్రేమ, శ్రద్ధ, రక్షణ ఉండాలి. మాటవినకపోతే బతిమాలో, భయపెట్టో అర్థం చేయించాలి. కానీ తమ మాట వినలేదని ప్రాణాలు తీసైనా ప్రేమను తుంచివేయాలని అనుకుంటున్నారు. ఇటీవల ప్రేమ పెండ్లి చేసుకున్న జంటలపై దాడులు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య మరువకముందే బుధవారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రేమ పెండ్లి చేసుకున్న కూతురుపై తండ్రి కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. వరుసగా జరుగుతున్న దాడులతో సభ్యసమాజానికి మనం సందేశం ఇస్తున్నామనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
చేయిపట్టి నడిపించిన చేతులే కిరాతంగా హత్యలకు తెగబడుతున్నాయి. నాన్న ఆకలి అంటే గొరుముద్దలు తినిపించిన ఆ చేతులే యమపాశాలుగా మారుతున్నాయి. ప్రాణం కన్నా పరువే ఎక్కువ అనే విపరీత ఆలోచనల ధోరణితో చివరికి చంపేందుకు కూడా వెనుకాడటం లేదు.
పరువు కోసం పాకులాడుతున్న తండ్రుల్లారా! మీరు చేస్తోంది మీ మనస్సులకైనా నచ్చుతుందా? ఒక్కసారి ఆలోచించండి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ముక్కుపచ్చలారని జీవితాలు సమాధి కావడమే కాదు ఇరుకుటుంబాలు రోడ్డున పడే పరిస్ధితి వస్తోంది. ఇంతా చేశాక పరువు దక్కుతుందా అంటే అదీ లేదు.
గుండెల మీద పెట్టుకున్న బిడ్డలు రక్తం మరకల్లో దిక్కులేక చస్తుంటే అదీ మీకు పరువుగా కనిపిస్తోందా? చిన్నానాడు బిడ్డ కన్నీరు చూసి అల్లాడిపోయే తండ్రి ప్రేమ…ఎందుకు ఇంత కర్కషంగా మారాలి? చిన్న అలికిడికే నాన్న అంటూ అభయం కోసం నిన్ను హత్తుకునే కూతురు నిన్నే చూసి భయంతో పారిపోతుంటే నీకు గౌరవమా? ఆ భయమే నీకు పరువుగా కనిపిస్తోందా?…సో ఒక్కసారి ఆలోచించండి పరువు పేరుత కన్న పేగును తెంచుకునిర జీవచ్చవంలా ఉందామా..? బిడ్డల మనసు తెలుసుకుని వారి సంతోషంలో పాలు పంచుకుందామా..?ఇకనైనా మారండి… పరువు,కులం పేరుతో జరిగే హత్యలకు స్వస్తి చెప్పండి…