జూన్ 12.. అసలేం జరగబోతుంది ?

40
- Advertisement -

2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడి సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. విపక్షాల ఐక్యత కోసం ఇప్పటికే కొంతమంది నేతలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కే‌సి‌ఆర్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, కేజ్రివాల్ వంటి వాళ్ళు ఇప్పటికే ఒకరినొకరు బేటీ అవుతూ తదుపరి వ్యూహరచన పై కసరత్తు చేస్తున్నారు. అయితే బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆయా పార్టీలతో కలుస్తుందా లేదా అనే సందేహాలు ఎప్పటి నుంచో వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే విపక్షాల కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని హస్తం నేతలు మొదటి నుంచి చెబుతున్నారు.

దీంతో కాంగ్రెస్ నేతృత్వంలో పని చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆమ్ ఆద్మీ, బి‌ఆర్‌ఎస్ వంటి పార్టీలు సిద్దంగా లేవు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రస్తావన లేకుండానే ఆయా పార్టీల నేతలు ఐక్యత విషయంలో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంచితే ఈ మధ్య బిహార్ సి‌ఎం నితీశ్ కుమార్ విపక్షాల కూటమి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల అధినేతలతో వరుసగా భేటీ అవుతూ చర్చనీయాంశం అవుతున్నారు. ఆ మధ్య మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, వంటి వారితో భేటీ అయ్యారు. ఇంకా పలువురు కీలక నేతలతో భేటీ అయ్యేందుకు కూడా సిద్దమౌతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని పాట్నాలో జూన్ 12న దాదాపు 20 విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి.

Also Read: ఛీ మోడీజీ.. దేశానికి సిగ్గు చేటు !

ఈ సమావేశం నితిశ్ కుమార్ అధ్యక్షతన జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సిపిఎం, సిపిఐ వంటి ప్రధాన పార్టీలు కూడా హాజరు కానున్నాయి. దీంతో జూన్ 12న ఏం జరగబోతుంది ? విపక్షాలు ఎలాంటి నిర్ణయంతో ముందుకు సాగబోతున్నాయి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ కూడా పాల్గొనడం కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ ఎంతోకాలంగా పిలుపునిస్తున్నప్పటికి ఇతర పార్టీలు కాంగ్రెస్ తో కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు జూన్ 12న జరిగే సమావేశానికి కాంగ్రెస్ కూడా హాజరు కానుంది. దీంతో ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రేక్షకపాత్ర పోషిస్తుందా ? లేదా నియంతృత్వ వైఖరి అవలంభిస్తుందా అనేది చూడాలి. మొత్తానికి మోడి సర్కార్ కు చెక్ పెట్టే దిశగా విపక్షాలు వేస్తున్న తొలి అడుగు జూన్ 12న మొదలవబోతుందనే చెప్పాలి.

Also Read: KTR:రెజ‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా..?

- Advertisement -