జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలనీ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కోరారు.
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధ్యక్షతన మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది.
సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ…భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ రోజు తుది ఓటరు జాబితా విడుదల చేశామన్నారు.తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నాయన్నారు.
ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో వెరిఫై చేసుకునేందుకు ECI వెబ్‌సైట్, CEO వెబ్‌సైట్, ERO కార్యాలయం, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లో సంప్రదించవచ్చుననీ కమిషనర్ తెలిపారు. రాజకీయ పార్టీలు, పౌరులు ఫారం-6, ఫారం-7, ఫారం-8 లో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి నామినేషన్ల చివరి తేదీ వరకు అవకాశం
ఉందన్నారు.
జులై 1, 2025 నాటికి18 ఏళ్లు నిండిన వారు, అర్హులు ఉండి ఇప్పటికీ ఓటరుగా నమోదు చేసుకొని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పడినందువల్ల కొంతమంది ఓటర్లు సమీప పోలింగ్ కేంద్రాలకు మార్చబడ్డారని అన్నారు. కాబట్టి ఓటర్లు తమ వివరాలు ఈసీఐ, సీఈవో వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికలు జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని ఆర్.వి. కర్ణన్ కోరారు.అంతకుముందు తుది జాబితా ప్రతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు.
సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ , రాజకీయ పార్టీల తరఫున కె. నందేశ్ కుమార్ (బీఎస్పీ), పొన్న వెంకటరమణ, కొల్లూరు పవన్ కుమార్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం. శ్రీనివాసరావు (సీపీఐఎం), పి. రాజేశ్ కుమార్ (కాంగ్రెస్), ముఠా జై, ఎ. శ్రీనివాస్ గుప్తా (బీఆర్‌ఎస్), కె. జోగేందర్ సింగ్, బి.వై. శ్రీకాంత్ (టీడీపీ), సయ్యద్ ఖలీలుద్దీన్ (ఏ ఐ ఎం ఐ ఎం) తదితరులు హాజరయ్యారు.
Also Read:ఆగని ట్రంప్ టారీఫ్ బాంబ్!

