‘ఆర్ఆర్ఆర్’చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా లెవెల్లో రికార్డులను బ్రేక్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర సక్సెస్‌పై తారక్ తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు.
‘‘సినిమా విడుదలైనప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ పై మీరు ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేమాభిమానాలు చాటుతున్నారు. నా కెరీర్ లోనే గొప్ప చిత్రంగా చెప్పుకునేలా చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు.
నేను ఇంత గొప్పగా నటించేలా స్ఫూర్తినిచ్చిన జక్కన్నకు ధన్యవాదాలు. నాలో ఉన్న గొప్ప నటుడిని బయటకు తీసుకొచ్చావు. నన్ను నిజంగా నీళ్లలా మార్చావు. కొత్తగా చూపించావు. నా పాత్రలో లీనమైపోయేలా..నన్ను నేను ఆ పాత్రకు తగినట్టు మలచుకునేలా నటుడిగా నన్ను మరింత ముందుకు తీసుకెళ్లావు. అందుకు జక్కన్నకు కృతజ్ఞతలు.
చరణ్ సోదరా.. నువ్వు లేకుండా ఆర్ఆర్ఆర్ ను ఊహించుకోవడం కష్టం. నువ్వు కాకుండా వేరెవరూ అల్లూరి సీతారామరాజు పాత్రకు అంత న్యాయం చేయలేరు. ఒక్క ఆర్ఆర్ఆర్ కాదు.. నువ్వు లేకుండా భీమ్ కూడా అసంపూర్తే. నా నీళ్లకు నిప్పులా నిలిచినందుకు ధన్యవాదాలు.
అజయ్ దేవ్ గణ్ లాంటి గొప్ప నటుడితో నటించడం నా గౌరవంగా భావిస్తున్నా. ఆ సమయాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటా.
ఆలియా.. నటనకు నువ్వో పవర్ హౌస్. నీ పాత్రతో సినిమా మరింత శక్తిమంతమైంది. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి.
ఒలీవియా, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ లు అద్భుతంగా నటించి అందరి మనసులు దోచుకున్నారు. ప్రేమాభిమానాలను సంపాదించారు. వారికి భారత సినిమాలోకి స్వాగతం. వారితో కలిసి నటించిన ప్రతి క్షణాన్ని గుర్తుంచుకుంటాను.
ప్రతిష్ఠాత్మక ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ కల సాకారమయ్యేలా చేసిన నిర్మాత డీవీవీ దానయ్యకు కృతజ్ఞతలు. మీరే మాకు నిజమైన వెన్ను.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంగీతంతో ప్రాణం పోసిన కీరవాణికి ధన్యవాదాలు. మనసును మెలిపెట్టే మీ సంగీతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరిన్ని సంవత్సరాల పాటు మీరిలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. మీ సంగీతం సాంస్కృతిక, భాష, భౌగోళిక హద్దులను దాటి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనసులను గెలిచింది.
భారతీయ సినీ చరిత్రలోనే ఓ అద్భుతమైన కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. కొన్ని కోట్ల సినీ ప్రేక్షకుల గుండెల్లో మీ కథ ఎప్పటికీ నిలిచిపోతుంది. రాబోయే తరాలూ మీ కథల గురించి చెప్పుకుంటాయి.
సెంథిల్, సాబూ, శ్రీనివాస్ మోహన్, శ్రీకర్ ప్రసాద్.. సినిమాలోని ప్రతి టెక్నీషియన్ కు పేరుపేరునా కృతజ్ఞతలు. వెండితెరపై ఇంత గొప్ప మ్యాజిక్ మీ వల్లే సాధ్యమైంది. మీ నిపుణత, సంకల్పం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.
సినిమాకు యాంకర్ గా నిలబడింది కార్తికేయ. ప్రతి విషయాన్ని చాలా గొప్పగా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లిన కార్తికేయకు ధన్యవాదాలు. భీమ్ జీవిత సంఘర్షణను అందరికీ చాటి చెప్పిన ‘కొమురం భీముడో పాట’కు తన గొంతుతో కాల భైరవ జీవం పోశాడు. కొన్ని లక్షల మందికి కన్నీళ్లు తెప్పించాడు.
‘నాటు నాటు’ పాటకు కొరియోగ్రఫీ చేసి.. జనానికి కొత్త స్టెప్పులను పరిచయం చేసిన ప్రేమ్ రక్షిత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అడుగడుగునా అండగా నిలిచిన భారత చిత్ర పరిశ్రమలోని పెద్దలకు, స్నేహితులు, సహచరులకు ధన్యవాదాలు. ఐక్యంగా ఉన్నాం కాబట్టే భారతీయ సినిమాకు ఇంత గొప్ప పేరొచ్చింది. అందరం ఒక్కటిగా ఉండి పనిచేస్తే ఎప్పుడో అప్పుడు ఇండియన్ సినిమా ప్రపంచ నెంబర్ వన్ అవుతుంది.
సినిమా గురించి చాలా మంచి మాటలు చెప్పిన భారత మీడియా సంస్థలకు కృతజ్ఞతలు. మా జర్నీలో భాగమై సినిమాను ఇంత గొప్పగా విజయవంతం చేయడంలో మీడియా పాత్ర మరువలేనిది.
చివరిగా నా అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలే కొవిడ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లోనూ నేను చాలా బాగా చేయడానికి స్ఫూర్తినిచ్చాయి. మరిన్ని సినిమాలతో మిమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉంటానని మాటిస్తున్నా’’ అని తారక్ తన నోట్ లో పేర్కొన్నారు.