ఉత్తమ్‌కు జర్నలిస్టుల షాక్‌..!

149
uttam kumar
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పర్యటనలో జర్నలిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రెస్‌మీట్‌ పెడుతున్నట్లు చెప్పి, డుమ్మాకొట్టడంతో ఆగ్రహించిన జర్నలిస్టులు ఉత్తమ్ ప్రెస్‌మీట్‌ను బహిష్కరించారు. దీంతో కంగారుపడిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు జర్నలిస్టులను బతిమాలుకున్న ఘటన మీడియా, రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పెద్దపల్లి జిల్లాలో పర్యటనలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులకు చుక్కలు చూపించారు. ఈ నెల 17న దారుణ హత్యకు గురైన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిల కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల పెద్దపల్లికి వచ్చారు. ముందుగా ఎన్టీపీసీలోని మిలినియం హాల్లో ప్రెస్ మీట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఉదయం 9.30 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని చెప్పడంతో దాదాపుగా అన్ని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, పత్రికా విలేకరులు మిలినీయం హాల్ వద్దకు చేరుకున్నారు.

అయితే 9.30 గంటలకు రావాల్సిన ఉత్తమ్ రాలేదు. హైదరాబాద్ నుంచి ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్‌కు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో జూమ్ మీటింగ్‌‌లో బిజీ అయిపోయారు. అక్కడ మిలినియం హాల్ వద్ద జర్నలిస్టులంతా ఉత్తమ్ రాకకోసం 11.30 వరకు పడిగాపులు కాచారు. ఎంతకీ ఉత్తమ్ రాకపోవడంతో విసిగి వేసారిన మీడియా ప్రతినిధులు అక్కడి నుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మిలినియం హాల్ పరిసరాల్లో కూడా కనిపించకపోవడం గమనార్హం. జూమ్ మీటింగ్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీగా ఉన్నారని, ప్రెస్‌మీట్‌‌కు రావడం ఇంకా లేటవుతుందని తెలుసుకున్న జర్నలిస్టులు అక్కడనుంచి తిరిగి వెళ్లిపోయారు..కనీసం ప్రెస్‌మీట్ ఉందా..లేదా…లేటవుతుందా అనే సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు…మీడియా అంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకంత చిన్నచూపు అంటూ జర్నలిస్టులు మండిపడుతున్నారు. జరల్నిస్టుల ఆగ్రహతో కంగారుపడ్డ కాంగ్రెస్ నేతలు సమాచారం లోపం అంటూ క్షమాపణలు చెప్పడంతో మీడియా, పత్రికాప్రతినిధులు మధ్యాహ్నం ఉత్తమ్ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారంట. కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిపై మీడియా వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది.

- Advertisement -