తెలంగాణ వ్యతిరేక శక్తులకు తలదించుకునే తీర్పులే ఉండాలి

225
cm kcr

తెలంగాణ ఏర్పాటును, ఏర్పడిన కొత్త రాష్ట్రం దేశం ముందు గట్టిగా నిలబడుతుంటే.. జీర్ణించుకోలేని శక్తులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల అభిమానాన్ని గెలవలేని పార్టీలు, వ్యక్తులు, కొన్ని సంస్థలు కుట్రలో భాగస్వాములు అవుతున్నాయి. ప్రజా బలం తో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ ను దెబ్బతీస్తే ..తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయవచ్చు.. అనే లక్ష్యంతో కేసీఆర్ ,తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి. ఆర్టీసీ సమ్మె ను దీనికోసం ఆయుధంగా వాడుకొని ప్రయోగిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదున్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రశాంతంగా  ఉండటం..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కొంత దూసుకుపోవడం.. ప్రజల్లో ఎలాంటి గందరగోళం,ఆందోళనలు లేకపోవటం.. కాంగ్రెస్, కాంగ్రెస్ లోని చంద్రబాబు నాయకులకు, బిజెపి, తెలుగుదేశం, సిపిఎం సిపిఐ ,కోదండరాం ,కొన్ని మీడియా సంస్థలకు.. ప్రధానంగా చంద్రబాబుకు నచ్చటం లేదు. ఈ ప్రశాంతత తెలంగాణలో కొనసాగటం వారికి ఇష్టం లేదు.గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ ను  దెబ్బ కొట్టి రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి చంద్రబాబు చేయని కుట్రలు కుతంత్రాలు లేవు. రాష్ట్రంలోని దాదాపు విపక్షాలన్నింటినీ కూడగట్టి రాష్ట్ర అస్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు. దీనికి ప్రజలు గుణపాఠం చెప్పి పంపించారు. ఆ షాక్ తో ఆ కూటమి నేతలంతా తేరుకోలేక ఇంకా గిలగిలా కొట్టుకుంటూ నే ఉన్నారు.

అయినా గోతి కాడ నక్కలా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో వేలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనేవున్నారు.ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను పట్టిపీడిస్తున్న అనేక జాడ్యాలను తొలగించడానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు.. దేశం ముందు.. భవిష్యత్ తరాలు కూడా తలెత్తుకొని నిలబడాలంటే.. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు కొన్ని కఠినంగా ఉండొచ్చు. వీటితో కొందరికి వ్యక్తులుగా ఇబ్బందులు రావచ్చు.. కానీ వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఆర్టీసీ , పంచాయితీరాజ్, మున్సిపల్ ,రెవెన్యూ ,వ్యవసాయ శాఖలో సంస్కరణలు ,చట్ట సవరణలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఈ వ్యవస్థలను పటిష్టం చేసి..ప్రజలకు సులువుగా, ఇబ్బందులు లేకుండా ,సేవలు అందిస్తే..తెలంగాణకు తిరుగుండదు . ఈసంస్కరణలతో తెలంగాణ బలోపేతం కావడమే కాక.. కేసీఆర్ మరింత శక్తివంతుడు అవుతారని భయంతో ఆర్టీసీలో వచ్చిన సమ్మెను వ్యతిరేక శక్తులంతా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం, కుట్రలు చేస్తున్నారు. ఆర్టీసీ నే కాకుండా మిగతా శాఖల్లో కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున సంస్కరణలు,ప్రక్షాళన, మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగులు కొందరు స్వాగతించక పోవచ్చు.. వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది.ఇందులో నుంచి వచ్చే ఆందోళనలను తమకు అనుకూలంగా మలచుకోవటానికి..కాంగ్రెస్, కాంగ్రెస్ లో కీలకంగా వున్న చంద్రబాబు మనుషులు.. తెలంగాణ ఏర్పాటును ఇంకా జీర్ణించుకోలేని సిపిఎం, కేంద్రంలోని బిజెపి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మె ను శాంతిభద్రతల సమస్యగా చేయాలని బిజెపి నేతలు మీడియా చర్చల్లో అంటున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రూపంలో ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వామపక్షాలు సైద్ధాంతిక పునాదిని భూమిలో పాతిపెట్టి.. కేసీఆర్ , తెలంగాణ వ్యతిరేక ఎజెండాను మోస్తూ ..చంద్రబాబు ,బిజెపికి పావులుగా ఉపయోగపడుతున్నాయి.ఆర్టీసీ విషయంలో తెలంగాణ వ్యతిరేకి.. మూలకు ఉన్న పవన్ కళ్యాణ్ కూడా నేను లేస్తే ఇక భూకంపమే అనే విధంగా వ్యవహారిస్తున్నారు .ఇదే పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఇసుక కోసం లాంగ్ మార్చ్ కార్యక్రమానికి బీజేపీ నాయకులను ఆహ్వానించడం పై ఆంధ్ర సిపిఎం, సిపిఐ నాయకులు తప్పు పట్టి ఆ ఆందోళన కార్యక్రమానికి వచ్చేది లేదని చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె లో మాత్రం బీజేపీతో కలిసి వేదికలు పంచుకోవడం ..అలాయి బలాయి తీసుకోవడం ..స్టెప్పులు వేయడం..  కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి . ఇక్కడ వామపక్షాలకు.. ప్రధానంగా సిపిఎం కు ఉన్నది నరనరాన కేసీఆర్ ,తెలంగాణ వ్యతిరేకత తప్ప సిద్ధాంత ప్రాతిపదిక ఏమీ కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ లోని చంద్రబాబు మనుషులు రాష్ట్రంపై పగబట్టినట్టు వ్యవహారిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను తన చేతుల్లోకి తీసుకోవడానికి చంద్రబాబు పెద్ద కుట్ర చేస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రోజు ప్రగతి భవన్ ముట్టడి పిలుపు లో కార్యకర్తలు ఎవరైనా గేటు ముట్టుకుంటే ఇంత మొత్తం.. లోపలికి పోతే కొంచెం ఎక్కువ మొత్తం..అనే ఆఫర్లు ఇచ్చినట్టు కార్యకర్తల్లో చర్చలు జరిగాయి .ప్రభుత్వం చేసే సంస్కరణల్లో వచ్చే ఎలాంటి అసంతృప్తులను, ఆందోళనలను.. చిన్నవి.. పెద్దవిగా చేయాలని చెబుతూ.. కాంగ్రెస్ లోని తన మనుషులకు చంద్రబాబు అన్నిరకాల సహాయ సహకారాలు గుట్టుచప్పుడు కాకుండా అందిస్తున్నారు. ఇలాంటి సహాయాలు చేసి రాష్ట్ర కాంగ్రెస్ ను క్రమంగా తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు.  ఆర్థికమాంద్యంతో రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తూనే ..రాష్ట్రాన్ని కి పట్టిన జాడ్యాలను.. సంస్కరణల రూపంలో తొలగించాల్సిన అవసరం ఉంది. శాఖల సంస్కరణలు ,ప్రక్షాళన అమలులో ఉద్యోగుల నుంచి అనేక అసంతృప్తులు వచ్చే అవకాశం ఉంది.   దీనిని ఆసరాగా చేసుకుని విపక్షాలు రాజకీయం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే పని చేస్తాయి. ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రజలు చైతన్యం, ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది. దేశం ముందు తెలంగాణ తలెత్తుకొని నిలబడాలన్నా.. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే.. ఉద్యమకారుడు.. తెలంగాణ కార్యసాధకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే శాఖల ప్రక్షాళనకు నిరంతరం ప్రజలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో కెసిఆర్ కు బాసటగా ఉంటున్నప్పటికీ.. అనుక్షణం రాజకీయ ,ఉద్యమ చైతన్యం చూపించాలి. తెలంగాణ వ్యతిరేకశక్తులు ఏ రూపంలో వచ్చినా.. సందర్భం ఎలాంటిదైనా..ఆ శక్తులు నిరంతరం తలదించుకునే విధంగా ప్రజల తీర్పు లు  భవిష్యత్తులో కూడా ఉండాలి.

నర్రా విజయ్ కుమార్
సీనియర్ జర్నలిస్ట్ (9052116316)

Vijay