రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

206
mareddy srinivas reddy

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కానున్నట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా చూడాలని, ఈ విషయంలో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతుకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులో ఉండేలా 3406 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1447 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 36,862 మంది రైతుల నుండి 2.51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇందులో 2.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగిందన్నారు.