ఇక ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌: సీఎం కేసీఆర్

182
KCR
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుధీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాల పైన మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై చర్చ :
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతి పై చర్చతో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ లు కేబినెట్ కు నివేదికలు సమర్పించాయి. వచ్చే నెల రోజుల లోపు, రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను.,అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇకమీద అన్ని గ్రామ పంచాయితీల్లో, వీధి దీపాల కొరకు మూడో వైర్’ ను తప్పకుండా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ కు సిఎం స్పష్టం చేశారు.

మున్సిపాలిటీల అభివృద్ధి పై చర్చ :
మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చేపట్టవల్సిన చర్యలమీద కేబినెట్ చర్చించింది. హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిథిలో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అధనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు చేసింది. నీటి ఎద్దడి నివారణకై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
తెలంగాణ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గృహ నిర్మాణాలకోసం అభివృద్ధి చేసే లే- అవుట్లలో, లాండ్ పూలింగ్ ’ విధానాన్ని అమలు చేయాలనే అంశం పై కేబినెట్ చర్చించింది. అందుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించాలని, విధి విధానాలపై దృష్టిసారించాలని, మున్సిపల్ శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రెసిడెన్షియల్ స్కూల్లల్లో స్థానిక విద్యార్ధులకు రిజర్వేషన్ :
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎం పీ పీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఉధ్యోగ సంఘాల విజ్జప్తికి ఆమోదం :
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్ జీవో , టీజీవో ప్రతినిధులు సిఎం కెసిఆర్ కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని , ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ ఆదేశించింది.
అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ ను తయారు చేయాలని,. ఉద్యోగాల ఖాళీల భర్తీకై.. ‘వార్షిక నియామక కేలెండర్’ (annual recruitment calendar) (జాబ్ కేలెండర్) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశించింది.ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. బుధవారం జరిగే సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ :
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇతర అధికారులు, ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్ కు వివరించారు.మందులు, ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాల పై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, ఔషదాల లభ్యత సహా మూడో వేవ్’ కు సంబంధించిన సన్నద్దత గురించి వైద్యారోగ్యశాఖ అధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. కరోనా నియంత్రణకు సంబంధించి వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.బుధవారం మధ్యాహ్నం తిరిగి రెండు గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది.

- Advertisement -