టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో ఆలస్యంగా వచ్చినా అదిరే ఎంట్రీ ఇచ్చి ఏడాదిలోనే 16 కోట్ల మంది కస్టమర్లను సంపాదించి డేటా విప్లవం సృష్టించింది. అధిక రేటు ఉన్న డేటా సేవలను అట్టడుగు వర్గానికి కూడా అందుబాటులోకి తెచ్చి మిగితా టెలికం సంస్థలకు పెద్ద షాకే ఇచ్చింది జియో. రిలయన్స్ జియో ఇప్పుడు పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెల్లింపుల సేవల కోసం గాను పేమెంట్స్ బ్యాంకులు ఏర్పాటు చేసుకునేందుకు 11 సంస్థలకు 2015లో లైసెన్స్ లు ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఆ సంస్థల్లో ఒకటైన టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మొదటిసారిగా 2016 నవంబర్‌లో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించింది. తరువాత 2017 మేలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభమయ్యాయి. తరువాత 2017లోనే జూన్‌లో ఫినో పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం అవగా తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు మొదలయ్యాయి.
తరువాత భారత పోస్టల్ శాఖకు కూడా పేమెంట్స్ బ్యాంక్ సేవలకు ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించింది. అయినా ఆ సంస్థ ఇంకా కార్యకలాపాలను మొదలు పెట్టలేదు. తరువాత ఇప్పుడు జియో తన పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 70 శాతం వాటా ఉండగా మరో 30 శాతం ఎస్‌బీఐ కలిగి ఉంది.