రిలయన్స్ జియో.. భారత మార్కెట్లో సంచలనం. మూడు నెలల ఉచిత ఫ్రీ కాల్స్, నెట్ అంటు కస్టమర్లను ఆకట్టుకున్న జియో మిగితా టెలికాం ఆపరేటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మార్కెట్ లోకి వచ్చిన రెండు నెలల్లోనే 5 కోట్ల మంది కస్టమర్లతో రికార్డు క్రియేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కలలు కంటున్న డిజిటల్ ఇండియాకు జియో దగ్గర దారి అన్న రీతిలో పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చింది రిలయన్స్.
ఇక జియో ప్రారంభ అడ్వర్టైజ్మెంట్లలో ఏకంగా ప్రధాని మోడీ ఫొటోలను ఉపయోగించింది. దీంతో ఫ్రీ పబ్లిసిటీ కూడా పొందింది.ఇదే విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించారు సమాజ్ వాది ఎంపీ నీరజ్. దీనికి సమాధానమిస్తూ ఇప్పటి వరకు దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని.. వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.
జియో ప్రకటనలో ప్రధాని ఫొటోను వినియోగించుకునేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాధారణంగా జాతీయ చిహ్నాలు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఐక్యరాజ్యసమితి, అశోక్ చక్ర, ధర్మ చక్రలను ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ సంస్థలు ఉపయోగించకూడదు. రిలయన్స్ మాత్రం జియో లైఫ్ పేరుతో డెడికేటెడ్ టూ ఇండియా అండ్ 1.2 బిలియన్ ఇండియన్స్ పేరుతో ప్రధాన మోడీ ఫొటో అతి పెద్ద యాడ్ పేపర్లలో ఇచ్చింది. దీనిపై స్పందించిన కేంద్రం.. ప్రధాని మోడీ ఫొటో ఉపయోగించటానికి ఎవరికీ ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సంబంధిత మంత్రి రాథోడ్.. ఆయా కంపెనీలకు రూ.500 ఫైన్ విధించే అవకాశం ఉందని తెలిపారు. జియోకి పడ్డ ఫైన్ చూసి వినియోగదారులు షాకవుతున్నారు.