త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ ఆచరణ ద్వారా సంస్కారాన్ని అందరికీ తెలియజేసే మహనీయుడని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో త్రిదండి చినజీయర్ స్వామి షష్టి పూర్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 22 ఏండ్ల క్రితం స్వామీజీతో కలిసి ఒకేవాహనంలో వారం రోజులపాటు పర్యటించే అవకాశం లభించిందని, అది తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తన గురువు గోపాలచార్యులకు పాదాభివందనం చేసిన తర్వాతనే స్వామీజీ యాత్రను ప్రారంభించేవారని కేసీఆర్ గుర్తుచేశారు. గురువులను పూజించిన తర్వాతనే మిగతా పనులు చేయాలనే సంస్కారాన్ని సమాజానికి త్రిదండి నేర్పారని సీఎం చెప్పారు. త్రిదండి వంటి ఒక మహా పరివ్రాజకుల షష్టిస్ఫూర్తి ఉత్సవంలో పాల్గొనడం తన భాగ్యమని ఇది అందరికీ ఆనందదాయకమైన పండుగ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
త్రిదండి చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ‘ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు. కానీ, అనుకున్నదానికి కట్టుబడి, ధర్మానికి నిలబడి, తాను చేయాలనుకున్న వాటిని చేయగలిగే వ్యక్తిత్వం గల మహనీయులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి మహనీయుడు శ్రీమాన్ కేసీఆర్ గారు. ముఖ్యమంత్రిగా వచ్చారు. రాజ్యపాలన చేస్తున్నారు. అందరి సహకారం ఆయనకు ఉంది.. అది చాలు. ఏమో, దేవుడి పేరు చెబితే ఎవరైనా, ఏమైనా అనుకుంటారేమో, దేవుడి పేరు చెబితే అందరికీ ఇష్టమవుతుందో లేదో… అనే అటువంటి అనుమానాలు లేని, ధైర్యం గల వ్యక్తి కేసీఆర్’ అని ప్రశంసించారు.
యాదాద్రి దేవాలయాన్ని రూ.500 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఆయన సాహసంగా ముందుకుపోతున్నారని అభినందించారు. సంకల్పం ఉండటం మాత్రమే సరిపోదు. ఆ సంకల్పాన్ని సాధించడానికి కావాల్సినంత మనోబలంతో ముందుకు సాగడమే గొప్ప లక్షణం. ఈ మహోన్నత లక్షణం పుష్కలంగా కలిగి ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పశుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అని ప్రశంసించారు. ఈ లక్షణాల వల్లనే ఆయన దేవాలయాల్లోని గొప్పతనాన్ని గ్రహించారని, దేవాలయాల ఉద్ధరణకు నడుం బిగించారని అన్నారు. ఒక్క యాదాద్రి మాత్రమేకాదు వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం వంటి దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని, ఈ కార్యాచరణ తమకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నదని త్రిదండి పేర్కొన్నారు.
దేవాలయాల నిధులతో కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి బాగు చేస్తున్నందుకు అందరం అభినందించి తీరాలని అన్నారు. బహుశా దేశంలోనే ఇంత సాహసంగా దేవాలయాల ఉద్ధరణకు ఏ నాయకుడు పాటుపడటం లేదని చెప్పారు. ఇలాంటి ముఖ్యమంత్రి తమకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. భగవంతుడి కోసం శ్రమించేవాళ్లకు, పనిచేసేవాళ్లకు భగవంతుడే రక్షకుడిగా ఉంటారని చెప్పారు. 1995లో కేసీఆర్ సిద్దిపేటలో ఒక యజ్ఞానికి సంకల్పం చేశారని అది ఏప్రిల్ మాసమని ఆయన గుర్తుచేశారు. వర్షాలు పడాలని ఆ యజ్ఞానికి సంకల్పం చేశారని, యజ్ఞం పూర్తయినరోజున కుండపోతగా వర్షం కురిసిందని స్వామీజీ జ్ఞాపకం చేశారు. వ్యక్తులలో ధర్మ నిష్ఠ ఉంటే సంకల్పం విజయవంతం అవుతుంది అని చెప్పడానికి ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని స్వామీజీ పేర్కొన్నారు. స్వామీజీ వేయికాళ్ల మండపం విషయాన్ని కూడా ప్రస్తావించారు.
36 సంవత్సరాల పరమహంస పరివ్రాజక జీవితంలో ఒడిదొడుకులు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వేయికాళ్ల మండప విషయాన్ని భగవంతుడే పరిష్కరిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీమద్ రామానుజాచార్య తిరునామాలు దిద్దారని ఆయన చెప్పారు. మనుష్యులందరూ సమానమేనని మొట్టమొదట చెప్పిన గొప్ప సంస్కర్త రామానుజచార్య అని స్వామీజీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలోని సామాజిక శాస్త్రవేత్తలందరూ దానిని అంగీకరించారని అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… తనకోసమే తను జీవించడం ప్రకృతి అని, ఇతరులను విధ్వంసం చేయడం వికృతి అని, ఇతరులకు తనది పంచిపెట్టడం సంస్కృతి అని చెప్పారు. ప్రపంచమంతటా భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను, విశిష్టాద్వైత ధర్మాలను ప్రబోధిస్తున్న చినజీయర్ స్వామీజీ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. షష్టిస్ఫూర్తి ఉత్సవ ఆహ్వాన సంఘం చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, జెట్ చైర్మన్ రంగరాజు, వికాసతరంగిణి చైర్మన్ పి.రమేశ్ గుప్తా, శ్రీఅహోబిల జీయర్ స్వామీజీ శ్రీ దేవనాథ జీయర్ స్వామిజీ, శ్రీవ్రతధర జీయర్ స్వామీజీ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. జైశ్రీమన్నారాయణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది.