అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విరుచుకపడ్డారు. వైసీపీ నేతలు ప్రజలను దోచుకోవడానికే అభివృద్ధని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కడప జిల్లా పులివెందులలో పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన జేసీ….జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై తనదైన శైలీలో చురకలంటించారు.
శ్రీకాంత్ రెడ్డి తనను జానీ వాకర్ అంటున్నారని..నాకు తాగే అలవాటు లేదన్నారు. సారా మా ఇంటా వంటా లేదని…తాగే అలవాటు వారికే ఉందన్నారు. నా నాలుక చీల్చు తానంటు మాట్లాడుతున్నాడని…నా నాలుక చీల్చేంత దమ్ముందా అంటు ప్రశ్నించారు. నీ దగ్గరికి వస్తా….నీ ఇంటికి వస్తా దమ్ముంటే నన్ను ముట్టుకోవాలని సవాల్ విసిరారు. జగన్ చెంచాగాడు శ్రీకాంత్ రెడ్డి అన్న జేసీ…రాజకీయాల్లో విమర్శించాలంటే అనుభవం,తెలుసు కోవాలన్న ఆలోచన ఉండాలన్నారు.
జగన్‌కు ఆయన తాత రాజారెడ్డి లక్షణాలు వచ్చాయని…నాడు వైఎస్ రాజారెడ్డి అభివృద్ధిని అడ్డుకున్నట్లే నేడు జగన్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. బుద్ది ఉన్న వాడు ఎవడన్నా…పట్టిసీమను అడ్డుకుంటాడా అని జగన్ పై ఫైరయ్యారు.
7వ తరగతి ఫెయిల్ అయిన వాడిని తాడిపత్రి ఇంఛార్జీగా పెట్టారని…కులం,వర్గంతో పెట్టుకుంటే లాభం లేదన్నారు. పులివెందులలో రక్తపాతం వద్దన్న జేసీ…రైతులు చప్పట్లు కొట్టడం కాదు..ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలన్నారు. 2019లో పులివెందులలో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.
కర్నూల్ జిల్లా మచ్చుమర్రి గ్రామంలో నిర్వహించిన సభలో సైతం జగన్‌పై జేసీ మండిపడిన సంగతి తెలిసిందే. కూలం కూడు పెట్టదని…ఎందుకో రెడ్లంతా వైకాపాకే మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్,చంద్రబాబు ఏ కులమని రాయలసీమకు నీళ్లు ఇస్తున్నారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతేగాదు జగన్‌కు బుద్దిలేదు కాబట్టే పట్టిసీమను వ్యతిరేకించాడని మండిపడ్డారు.