కంచిపీఠాదిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. కంచి కామకోటి పిఠానికి ఆయన 69వ అధిపతి.నిన్న అనారోగ్యంతో కాంచీపురం ఏబీసీడీ ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు.
జూలై 18 ,1935లో జన్మించిన సుబ్రహ్మణ్య అయ్యర్… కంచి పీఠాధిపతి అయిన తర్వాత జయేంద్ర సరస్వతిగా పేరుమార్చుకున్నారు.ఆయన అధ్వర్యంలో కంచి పీఠం బలమైన సంస్థగా ఎదిగింది. ఈ మఠంకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.
కంచి మఠం అనేక పాఠశాలను, కంటి ఆసుపత్రిలు మరియు ఆసుపత్రులను నడుపుతూ ఉంది. చెన్నై లోని శంకర నేత్రాలయం మరియు అస్సాం రాష్ట్రం లోని గౌహతి వద్ద గల శంకరదేవ నేత్రాలయం వంటివి స్థాపించబడ్డాయి. అదే విధంగా పిల్లల ఆసుపత్రి, హిందూ మిషన్ ఆసుపత్రి మరియు తమిళనాడు ఆసుపత్రి వంటి అనేక సంస్థలు ప్రజల సంక్షేమం దృష్ట్యా నెలకొల్పబడ్డాయి.
సౌమ్యుడిగా పేరున్న ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు.1987లో మఠం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. మఠం నియమావళి ప్రకారం పీఠాధిపతి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. జయేంద్ర సరస్వతి అదృశ్యమైన వార్తను దేశంలోని పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. నాలుగు రాష్ట్రాల పోలీసుకు ఆయన కోసం అన్వేషించారు. చివరికి ఆయన కర్నాటక కూర్గ్‌లోని తలకావేరి వద్ద కన్పించారు. ఆయన అలా మాయం కావడం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలింది. జయేంద్ర సరస్వతి మృతితో పలువురు విచారం వ్యక్తం చేశారు.