జయసుధ@వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు

16
- Advertisement -

రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారు సినిమా, సంగీతం, వైద్య విభాగం చెందిన ప్రతిష్టాత్మక ‘వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు’ (వృత్తిపరమైన సమర్ధత పురస్కారం) కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వైభవంగా జరిగింది. సినిమా రంగం నుండి సహజ నటి శ్రీమతి జయ సుధ, నటుడు శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ లకు, సంగీతం నుండి ప్రఖ్యాత ఈల పాట గాయకుడు ఎం వి రమణా రెడ్డి కి, శ్రీమతి డా. సాయి పద్మ (బయో కెమిస్ట్రీ) లకు ఐ ఏ ఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ఎజికెషన్ ప్రిన్సపల్ సెక్రటరీ శ్రీ బి వెంకటేశం ముఖ్య అతిధి గా అయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందచేశారు. ఈ కార్యక్రమం లో రోటరీ క్లబ్ ఈస్ట్ కు చెందిన అధ్యక్షులు శ్రీ సుదేష్ రెడ్డి, వోకేషనల్ సర్వీస్ డైరెక్టర్ శ్రీ సి వి సుబ్బా రావు, కార్యదర్శి శ్రీ టి ఎం ఎన్ చౌదరి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ఎజికెషన్ ప్రిన్సపల్ సెక్రటరీ శ్రీ బి వెంకటేశం మాట్లాడుతూ ” రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఈ రోజు ఆయా రంగాలకి చెందిన ప్రముఖులు జయ సుధ, ఈల పాట గాయకుడు ఎం వి రమణా రెడ్డి, కాదంబరి కిరణ్ కుమార్, డా. సాయి పద్మ గార్లకు ఈ పురస్కారాలను నా చేతుల మీదుగా అందచేయడం గర్వంగా వుంది. ప్రజలకు సేవ చేసే మనస్తత్వం మన పిల్లలకు చిన్నతనం నుండే వారికీ మనం స్ఫూర్తివంతం కావాలి. వాళ్లు భారీగా ఖర్చు పెట్టె పుట్టిన రోజు పండుగలకు అయ్యే ఫండ్ పేదవారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికీ నచ్చచెప్పాలి. రోటరీ క్లబ్ వారు ఇంకా మరిన్ని సేవ కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

సహజ నటి జయ సుధ మాట్లాడుతూ ” రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు నా చిన్నతనం నుండి చూస్తున్నాను. పాఠశాలలు, వైద్య శాలలు, పేదలకు సహాయం వంటివి ఎన్నో వున్నాయి. నంది అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్, జాతీయ అవార్డులకు ఎంత ప్రాధాన్యత ఉందొ? రోటరీ క్లబ్ వారి అవార్డుకు కూడా అంతే ప్రత్యేకత వుంది. నా కెరీర్ బిగినింగ్ లో రోటరీ క్లబ్ అవార్డు కోసం ఎదురు చేసేదాన్ని, అలాంటిది ఈ రోజు నేను ఎక్ససెలెన్సు అవార్డు అందుకోవడం ఆనందంగా వుంది. రోటరీ క్లబ్ సభ్యులు సుదేష్ రెడ్డి, సి వి సుబ్బా రావు, టి ఎం ఎన్ చౌదరి గార్లకు నా ధన్యవాదాలు.” అన్నారు.

కాదంబరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ “రోటరీ క్లబ్ వారు గుర్తించి ఇచ్చిన ఈ అవార్డు కు నా కృతజ్ఞతాభినందనాలు. నేను సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 40 ఏళ్ళు కావస్తుంది. సాటి మనిషికి నా వంతు సాయం చేయాలనే సంకల్పంతో ‘మనం సైతం’ చారిటీ స్థాపించాను. జంతువులు కూడా తమ ఆహరన్నీ తమ తోటి జంతువులకు అందించాలనే దృక్పథం ఉంటుంది. కోతి తన తోటి వందల కొద్ది కోతులతో కలసి ఆహారం సంపాదిస్తాయి. కాకికి ఎక్కడైనా ఆహరం దొరికితే పది కాకులను కావ్ కావ్ అని పిలుచుకుంటుంది. అలాగే చీమలు కూడా.. కానీ ఒక్క మనిషే తన కోసం తన సంబధీకుల కోసం స్వార్ధం తో జీవిస్తాడు. ఇప్పటి వరకు చేసింది ఓకే ఎత్తు అయితే, అనాధలకు, వృద్దులకు ఆశ్రయం కల్పించాలని ‘సపర్య’ అనే సంస్థను స్థాపించి అనాధలకు, వృద్దులకు సేవ చేయాలని వారికి చక్కటి వసతి కల్పించాలని అనుకుంటున్నాను” అన్నారు.

ప్రఖ్యాత ఈల పాట గాయకుడు ఎం వి రమణా రెడ్డి రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారికీ కృతజ్ఞతలు తెలుపుతూ తనదైన శైలిలో ఈల పాటలు పాడి సభను అలరించారు. అవార్డు అందుకున్న డా. సాయి పద్మ రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన వృత్తి లో వున్న అనుభవాలను వివరించారు. చివరగా ముఖ్య ముఖ్య అతిధి శ్రీ బి వెంకటేశం ను రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఈస్ట్ సభ్యులందరూ సన్మానించి జ్ఞాపికను అందచేశారు.

Also Read:ఐరన్ లోపమా.. జాగ్రత్త?

- Advertisement -