జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా చూశాను. ఇటీవలకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని నా ఫీలింగ్. ఈ సినిమా చూశాక.. మన చుట్టూరూ ఉండే మనుషుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించొచ్చొ నాకు అర్ధమయ్యింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి నాకు కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ ఇంత మంచి సినిమా ప్రచారంలో పాలు పంచుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. రవిచంద్ర సమకూర్చిన సంగీతం ఈ సినిమాకు గల ప్రధాన ఆకర్షణలో ఒకటని చెప్పొచ్చు ” అన్నారు ప్రముఖ దర్శకులు కొరటాల శివ.
“సమైక్యంగా నవ్వుకుందాం” అనే ట్యాగ్ లైన్ తో.. “దేశవాళీ వినోదం” అనే సరికొత్త నినాదంతో.. శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం కొరటాల శివ పైవిధంగా స్పందించారు.
ఇదే కార్యక్రమంలో.. ఈ చిత్రంలో జీవా పోషించిన “పితా” పాత్ర ఫస్ట్ లుక్ మరియు క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ.. “సహజత్వానికి దూరంగా ఉండే సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ చూసి చూసి విసిగిపోయి ఉన్నతెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచె చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా”. చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు” అన్నారు.
“జయమ్ము నిశ్చయమ్మురా”లో పోసాని కృష్ణ మురళి పోషించిన “గుంటూరు పంతులు” పాత్ర ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల చేసిన ప్రముఖ యువ దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “”జయమ్ము నిశ్చయమ్మురా”లో హీరోగా నటించిన నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డిని చూసి చాలా గర్వ పడుతున్నాను. శివరాజ్ కనుమూరి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు” అన్నారు.
తమ సినిమా చూడడం కోసం.. మరియు ఈ కార్యక్రమం కోసం ఒక రోజంతా కేటాయించిన కొరటాల శివ, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడిలకు దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రం ప్రదర్శన హక్కులు తీసుకున్న ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి “జయమ్ము నిశ్చయమ్మురా” సంచలన విజయం సాధించడం ఖాయమన్నారు.
చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన కృష్ణ భగవాన్, రవివర్మ, కృష్ణుడు, జోగి బ్రదర్స్, చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, నిర్మాతల్లో ఒకరైన సతీష్ కనుమూరి తదిరులు పాల్గొన్నారు. ఈ వారంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.