పోయెస్ గార్డెన్‌కు జయ పార్దివదేహం..పలువురి సంతాపం

194
jayalalitha
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సామాజిక మాధ్యమాల్లో పలువురు సంతాపం తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ, హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులు, మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, సినీ నటులు సిదార్థ, జీవా, రాయ్‌లక్ష్మీ తదితరులు జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు. జయలలిత మరణం తనను కలిచివేసిందని, ఆమె గొప్పనాయకురాలని గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు.

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివంగతించిన తమిళనాడు జయలలిత పార్థివదేహాన్ని పోయెస్ గార్డెన్‌కు తరలించారు. పదవీకాలంలో జయ వినియోగించిన కాన్వాయ్‌ వెంటరాగా.. ప్రత్యేక అంబులెన్స్‌లో జయ పార్థివదేహాన్ని మొదట ఆమె అధికార నివాసం పోయెస్‌ గార్డెన్‌కు తరలించారు. ఇవాళ సాయంత్రం జయలలిత అంత్యక్రియలు జరగనున్నాయి.

పోయెస్‌ గార్డెన్‌ నుంచి రాజాజీ పబ్లిక్‌ హాల్‌కు తరలించి, మంగళవారం మొత్తం అక్కడే ఉంచనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలోని ఇతర పార్టీల నాయకులు, ప్రజలు.. రాజాజీ హాలులోనే జయ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు చెన్నై నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే కన్నుమూసిన జయలలిత మృతికి సంతాపంగా తమిళనాడులో ఏడు రోజులు సంతాపదినాలు పాటించనున్నారు. మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -