అమ్మ జయలలిత ఇకలేరు…

233
Jayalalithaa is no more..!
- Advertisement -

74 రోజుల సస్పెన్స్‌కు తెరపడింది. తమిళ పురచ్చితలైవి…అమ్మ జయలలిత మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.మిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమాశారు. ఆసుపత్రి వైద్యులు ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించడంతో రాష్ట్రప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. గత సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్‌తో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత దాదాపు రెండు నెలల చికిత్స అనంతరం ఇటీవల కొంత కోలుకున్నారు. అభిమానుల ప్రార్థనలతోనే తాను పునర్జన్మ ఎత్తానని, త్వరలోనే తిరిగి వచ్చి ప్రజాసేవకు పునరంకితమవుతానని జయలలిత ప్రకటించారు.

నిన్న సాయంత్రం గుండెపోటు రావటంతో అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు…చివరి వరకు జయను బ్రతికించేందుకు శ్రమించారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి తమిళ ప్రజలను శోక సంద్రంలో పడేస్తు జయలలిత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు.

ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పిన మహిళ…ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాల్లో, అన్నాడీఎంకేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీర వనిత. ఆమె సింగిల్ హ్యాండ్ తో పాలిటిక్స్ ని నడిపించగల సత్తా ఉన్న ఉక్కు మహిళ..కంటిచూపుతో పార్టీని శాసించగల నేర్పు..అవరోధాలను, ప్రతికూలతలను ఎదుర్కొనే సత్తా…ఒక్కమాటలో చెప్పాలంటే జయ అంటే తమిళనాట ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి.. ఒకానోక దశలో దేశ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రను వేసుకుంది జయలలిత.

తమిళ చరిత్రను తిరగరాస్తు…వరుసగా రెండోసారి పాలన పగ్గాలు చేపట్టిన ఆస్పత్రి పాలవటంతో తమిళనాడు అంతటా అయోమయం..గందరగోళం.. అందరిలో అనేక ప్రశ్నలు. జయ మాట్లాడుతున్నారు….లేదు జయలలిత పరిస్థితి విషమంగానే ఉంది….అనేక సందేహాలు..ప్లీజ్ అమ్మను చూపించండి అంటూ అభిమానుల పూజలు….చివరికి 74 రోజులుగా అపోల్ ఆస్పత్రిలో కన్నుమూశారు.తానొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్టు జయలలిత చికిత్స పొందుతూనే తన అశేషాభిమానులకు సుదీర్ఘ వీడ్కోలు పలికారు. తిరిగిరాని లోకానికి తరలిపోయారు. 68 ఏళ్ల జయలలిత రికార్డు స్థాయిలో ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి…పురట్టితలైవి (విప్లవనాయకురాలు)గా, అమ్మగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చివరివరకూ అవివాహితగానే ఆమె జీవితాన్ని గడిపారు.

జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి ఏఐఏడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పొలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. పలుచోట్ల కార్లు, హోర్డింగులు ధ్వంసం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు, బ్లాక్‌ కమాండోస్‌ను రంగంలోకి దించారు. తమిళనాడు అంతటా కూడా ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -