చెరగని చిరునవ్వు.. ముత్యాలు రాలే కంఠస్వరం.. ఆత్మీయంగా పలకరించే తత్వం.. శత్రువులకు, ప్రత్యర్థులకు ఆమె ఓ అహంభావి, అవినీతిపరురాలు, రాక్షసి. నమ్మినవారికి ఇలవేల్పు.. పార్టీ శ్రేణుల్లో దేవత.. ప్రజలకు పురిచ్చితలైవి.. విప్లవనాయకి. మూడున్నర దశాబ్దాల పాటు దక్షిణాది రాజకీయాల్లో ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన జయలలిత…అన్నిపార్టీలతోను సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక ముఖ్యంగా అమ్మ రాజకీయ జీవితంలో తెలుగు గవర్నర్లు మర్రిచెన్నారెడ్డి, రోశయ్య, విద్యాసాగర్ రావు ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించారు. తెలుగు గవర్నర్లతో అమ్మ…మంచి అనుబంధాన్ని కొనసాగించారు.
1990లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. అయితే, వాళ్లిద్దరికీ అసలు పడేది కాదంటారు. చెన్నారెడ్డి తన అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటే.. జయలలిత మాత్రం ఆయనను ఎప్పటికప్పుడు తగ్గించాలని చూసేవారు.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన రోశయ్య సైతం తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే, మర్రి చెన్నారెడ్డిలా కాకుండా రోశయ్య..జయలలితతో మంచి అవగాహనతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు ఉన్నారు. చెన్నమనేనికి జయలలితో మంచి అనుబంధం ఉంది. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి విద్యాసాగర్ రావు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తునే ఉన్నారు. అంతేగాదు పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి జయను పరమర్శించారు.
ఇక సినీ రంగంలో తనదైన ముద్రవేసిన జయలలితకు టాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. నందమూరి తారకరామారావుతో కలిసి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగం నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగా….ఎంజీఆర్ వారసురాలిగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన జయ…ఆరు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి తమిళ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. ఎన్టీఆర్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు,శోభన్ బాబు,కృష్ణ వంటి స్టార్ హీరోలతో జయ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.