తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు పూర్తీ అయ్యాయి. మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్ సమాధి పక్కన ఆమె పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి. రాజాజీహాల్ నుంచి ప్రారంభమైన జయలలిత అంతిమ యాత్ర మెరీనాబీచ్ వరకు చేరుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అమ్మ కు అంతిమసంస్కారాలు జరిగాయి. జయలలిత అంతిమ సంస్కారాలను..అమ్మ ఆప్త మిత్రురాలు శశికళ పూర్తి పురోహితుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఆమె పార్థివ దేహాన్ని ఖననం చేశారు. అమ్మకు కడసారి వీడ్కోలు పలికేందుకు..అశేష జనవాహిని కదిలివచ్చింది.
కన్నీటీ పర్యంతంతో తమిళ ప్రజలు అమ్మను సాగనంపారు. అమ్మకు అంతిమ వీడ్కోలు పలికేందుకు రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ వరకు దారిపొడవునా ప్రజలు భారీగా వేచి ఉన్నారు. అమ్మ అంత్యక్రియల్లో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ,తెలంగాణ ప్రభుత్వం తరపున ఇరిగేషన్ మంత్రి హారీష్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొని పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తో పాటు పార్టీ మంత్రులు.. ఎమ్మెల్యేలు, శశికళ, త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు. జయలలిత పార్థివదేహాన్ని తరలించే ప్రక్రియ ప్రారంభం కాగానే, రాజాజీహాల్ జయ అభిమానులు, పార్టీ కార్యకర్తల రోదనలతో మిన్నంటింది. జయలలితను ఇక చూడలేం అంటూ బరువెక్కిన గుండెతో అభిమానులు..కార్యకర్తలు అమ్మకు కన్నీటి తో సాగనంపారు.