‘జయఘోష’ ప్రతులను కొండగట్టుకు సమర్పించడం నా భాగ్యం- కవిత

153
mlc kavitha
- Advertisement -

శారీరక, మానసిక పరిమితులకు అతీతంగా సాధకునికి అవసరమైన మార్గదర్శనం చేస్తూ ఆంజనేయస్వామి వారి మంత్రమయ గ్రంధాన్ని ‘ జయఘోష’గా అందించే భాగ్యం తనకు కలగడం కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహమేనని నిజామాబాద్ ఎమ్మెల్సీ ,తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శ్రీ శృంగేరిపీఠం జ్ఞానసరస్వతి దేవాలయం ధర్మాధికారి, త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి సమర్పణలో ‘ జయఘోష ‘ లక్ష ప్రతులను కల్వకుంట్ల కవితకి ఉచితంగా అందించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ మంత్రగ్రంథ నిర్మాణాన్ని అత్యంత వైభవంగా అందించడం ప్రత్యేక విశేషంగా పేర్కొన్నారు. లక్ష పుస్తకాలను అందజేసి, గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన పురాణపండ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. లక్ష’ జయఘోష ‘ పుస్తకాలను కొండగట్టు అంజన్న సన్నిధానానికి పంపనున్నారు.

ఈ సందర్భంగా కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న విశేష అనుగ్రహంగానే కల్వకుంట్ల కవిత నేతృత్వంలో గత నలభై రోజులపాటు తెలంగాణ అంతటా హనుమాన్ చాలీసా ప్రతిధ్వనించిందని వివరిస్తూ ‘ పరాశర సంహిత’ ఆధారంగా ఈ మంత్ర తంత్రాత్మకమైన హనుమాన్ స్తోత్ర, వ్యాఖ్యానాలను ఇలా ‘ జయఘోషగా ‘ అందివ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత చొరవతో కొండగట్టు అంజన్న దేవస్థానం కేంద్రంగా జరిగిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం స్పూర్తితో, ఈ పుస్తకాలను అందజేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవీ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -