జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పవన్ కల్యాణ్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ స్థాపించి నేటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. పార్టీ 9వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అమరావతి ప్రాంతంలోని ఇప్పటం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన అగ్రనేతలతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జై ఆంధ్రా, జై తెలంగాణ, జై భారత్ అంటూ ప్రారంభించారు. లోక కల్యాణం కోరే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత పెద్దలకు, నిత్యం రామకోటి రాసే స్త్రీమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. “కొదమ సింహాల్లాంటి జనసైనికులు, ఆడబెబ్బులి వంటి వీరమహిళలకు శుభాభినందనలు. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సభ పెట్టుకోండి అని సహకరించిన మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను.
ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరఫున రూ.50 లక్షలు ప్రకటిస్తున్నాను. అలాగే, సభ నిర్వహణకు అనుమతిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీసు అధికారులకు, నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లానాయక్ లైన మా ఎస్సైలకు… మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ నేతలు కేసీఆర్, కేటీఆర్ లకు, ఇతర పార్టీల నేతలందరికీ, ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు, వైసీపీలోని కొందరు నేతలకు కూడా ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. వైసీపీలో బూతులు తిట్టే నేతలే కాకుండా, ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి వంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు.
గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి, తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నట్టు వివరించారు. “నమస్కారాల పర్వం పూర్తయింది. మరీ ఇంతమందికి నమస్కారాలా? అని కొందరు అనుకోవచ్చు. అది జనసేన సంస్కారం. ఒక పార్టీని నడపడానికి వేల కోట్లు ఉండాలా? అంటే ఒక బలమైన సిద్ధాంతం ఉండాలని అంటాను అన్నారు పవన్.