జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త పోరాట యాత్ర ఆదివారం ప్రారంభమైంది. శనివారం రాత్రి ఇచ్ఛాపురంలో బస చేసిన ఆయన ఈరోజు ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపస కుర్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు చేశారు. అక్కడి నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది. కాగా, అసమానతలు లేని సమాజం కోసం ప్రయత్నిస్తున్నానని, అందుకే ప్రజా పోరాటయాత్ర ప్రారంభించానని పవన్ పేర్కొన్నారు. ఇచ్ఛాపురం వెళ్లడానికి ముందు ఆయన శనివారం మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో విలేకరులతో మాట్లాడారు.
ప్రజారాజ్యం పార్టీ పుట్టుక నుంచి విలీనం వరకు అన్నీ ప్రత్యక్షంగా చూశానని, ఆ తర్వాత కూడా పార్టీ పెట్టానంటే.. ఏ లక్ష్యం కోసం ఇవన్నీ చేస్తున్నానో అవగాహన చేసుకోవాలన్నారు. అన్నీ వదిలేసి వచ్చిన తనకు ఏ భయం లేదని, దేనిని లెక్క చేయనని స్పష్టం చేశారు. 11 గంటలకు ఇచ్ఛాపురం స్వేచ్ఛవతి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు. దేవాలయం నుంచి బహిరంగ సభాస్థలి వరకూ నిరసన కవాతు నిర్వహిస్తారు. 3 గంటలకు సురంగి రాజా వారి మైదానంలో బహిరంగ సభ మొదలవుతుంది. అక్కడి నుండి కవిటి మండలానికి చేరుకుంటారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా పవన్‌కల్యాణ్ తొలి దశలో 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తిరుగుతారు. బస్సు యాత్ర చేపడతారని తొలుత ప్రచారం సాగినా ఆ తర్వాత పోరాటయాత్రగా ప్రకటించారు. బస్సుయాత్ర కేవలం ప్రసంగాలకే పరిమితమని, జనంతో మమేకమయ్యే అవకాశం ఉండదని.. అలాగని పూర్తి స్థాయి పాదయాత్ర చేయడానికి అభిమానుల తాకిడితో సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతోనే దీన్ని పోరాటయాత్రగా రూపకల్పన చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొంత బస్సులో తిరుగుతారు. రోడ్డు షోలు నిర్వహిస్తారు. ప్రధానంగా సమస్యలపై దృష్టి సారించి లోతు పరిశీలనతో మేనిఫెస్టో కమిటీతో కలిసి పరిష్కార మార్గాలపైనా అవగాహన పెంచుకునేలా ఈ యాత్రను మలుచుకోవాలని యోచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నియోజకవర్గ కేంద్రాల్లో కవాతులతో పాటు రోడ్డుషోలు నిర్వహిస్తారు. ఆ జిల్లా పర్యటన ముగిసే రోజు జిల్లా కేంద్రంలో సభలు, జన సమీకరణతో ప్రజాభిప్రాయాన్ని ప్రజా ఆకాంక్షలను వ్యక్తీకరించే యోచనతోనే కార్యక్రమాన్ని ఈ తరహాలో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. ఈ యాత్ర సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లు లేదా కల్యాణ మండపాల్లోనే జనసేన అధినేత రాత్రి బస చేయనున్నారు.