కర్ణాటక సిఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం..!

283
H.D. Kumaraswamy invited to form govt in Karnataka
- Advertisement -

కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కింగ్‌ మేకర్‌ మరోసారి కింగ్‌ కానున్నారు. కూటమి ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ శాసనసభాపక్ష నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనెల 23వ తేదీ బుధవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పట్నుంచి ఉత్కంఠ పరిణామాల మధ్య మలుపులు తిరిగిన కన్నడ రాజకీయం యడ్యురప్ప రాజీనామాతో కొంత వేడి తగ్గింది. శనివారం రాత్రి కుమారస్వామి గవర్నర్‌ వజూ‌భాయి వాలాను కలిశారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

H.D. Kumaraswamy invited to form govt in Karnataka

అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ తమను ఆహ్వానించారని వెల్లడించారు. తమకు 15 రోజుల గడువు ఇస్తామని గవర్నర్‌ చెప్పారని.. అయితే తమకు అంత సమయం అక్కర్లేదని, సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీని సమావేశపర్చనున్నట్టు చెప్పామని కుమారస్వామి వివరించారు.

దీనిలో భాగంగా కాంగ్రెస్‌ నేతలతో సమావేశం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించనున్నట్టు వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవ్యవస్థ పాత్రను అభినందిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలను ఉపయోగించి భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్న కుమారస్వామి.. అలాంటి బెదిరింపులకు తాను ఏమాత్రం భయపడనని, ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు. మంత్రి పదవులపై కాంగ్రెస్‌ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

బెంగళూరులోని కంఠీరవ మైదానంలో 23న జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొటారని కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌, పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు.

- Advertisement -