‘జంబలకిడి పంబ’ మూవీ రివ్యూ

243
Jamba Lakidi Pamba review
- Advertisement -

శ్రీనివాస్‌రెడ్డి హీరోగా `గీతాంజ‌లి`, `జ‌యమ్ము నిశ్చ‌య‌మ్మురా` చిత్రాలు ఆయ‌న‌కి మంచి విజ‌యాల్ని అందించాయి. త‌న‌కు త‌గ్గ క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచడంలో చ‌క్క‌టి ప‌రిణ‌తి చూపుతున్నారు. దాంతో ఆయ‌న క‌థానాయ‌కుడిగా సినిమా చేసిన ప్ర‌తిసారీ దానిపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. `జంబ‌ల‌కిడి పంబ‌` విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ పేరు కూడా సినిమా ప్ర‌చారానికి కీల‌కంగా మారింది. మ‌రి సినిమా ఎలా ఉంది? శ్రీనివాస్‌రెడ్డి క‌థానాయ‌కుడిగా మ‌రో విజ‌యాన్ని అందుకున్న‌ట్టేనా? అనే విషయం తెలుసుకుందాం.

Jamaba Lakidi Pamba Movie Review

కథ:
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ వరుణ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ పల్లవి(శ్రీనివాస్‌, సిద్ధి ఇద్నానీ) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలోపే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. దాంతో విడిపోవాలనుకుంటారు. ఇలాంటి జంటలకు విడాకులు ఇప్పించడమే పనిగా పెట్టుకున్న న్యాయవాది హరిశ్చంద్ర ప్రసాద్‌(పోసాని కృష్ణమురళి)ని సంప్రదిస్తారు. వరుణ్‌, పల్లవిలను విడగొడితే వంద జంటలకు విడాకులు ఇప్పించిన న్యాయవాదిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కుతానని సంబరపడుతుంటాడు హరిశ్చంద్ర ప్రసాద్‌. ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్‌ తన భార్యతో కలిసి గోవా టూర్‌కి వెళ్తారు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ చనిపోతారు. పైకి వెళ్లాక దేవుడు హరిశ్చంద్రను రానివ్వడు. ఇదేంటని హరిశ్చంద్ర దేవుడిని అడిగితే.. ‘నువ్వు విడగొట్టాలనుకున్న వందో జంటను కలిపితేనే నీ భార్య వద్దకు నిన్ను పంపుతాను’ అని చెప్తాడు. అప్పుడు ఆత్మ రూపంలో కిందకి దిగివచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్..‌ వరుణ్‌, పల్లవిలను కలపడానికి ఎన్ని పాట్లు పడ్డాడు? ఎంతకీ కలిసి ఉండటానికి ఇష్టపడని వరుణ్‌, పల్లవి దంపతులపై జంబ లకిడి పంబ మంత్రం వేశాక ఏం జరిగింది? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:
సినిమాలో హీరో, హీరోయిన్లుగా శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని న‌ట‌న‌ ఆకట్టుకుంది. గోపీసుందర్ అందించిన నేప‌థ్య సంగీతం బాగుంది. కెమెరా పనితం సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

మైన‌స్ పాయింట్స్:
సినిమా క‌థ‌న పేల‌వంగా ఉండ‌టం. ఆకట్టుకునేలా ట్విస్టులు లేక‌పోవ‌డం, గోపీ సుందర్‌ అంధించిన పాట‌లు ఆక‌ట్టుకునేలా లేక‌పోవ‌డం. సినిమా సాగ‌దీత‌గా అనిపించడం.

సాంకేతిక విభాగం:
గోపి సుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అనవసర సన్నివేశాలకు కత్తెర వేస్తే సినిమా కాస్త ఆసక్తికరంగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Jamaba Lakidi Pamba Movie Review

తీర్పు :
చీటికీ మాటికీ గొడ‌వ‌లు ప‌డే దంప‌తులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మాట నిజ‌మే. అలాగే కొంత‌మంది స్వార్థ‌ప‌రులైన న్యాయ‌వాదులు దీన్నే అవ‌కాశంగా భావించి డ‌బ్బు సంపాదించ‌డానికే మొగ్గుచూపుతుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా లాక్కొస్తుంటారు. ఇంతా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. ఒక్క క్ష‌ణం ఎదుటివారి స్థానంలో నిలుచుని ఆలోచిస్తే అంతా అదే స‌ర్దుకుంటుంది అని చెప్పే సినిమా ఇది. అయితే లైన్‌గా విన‌డానికి బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. పాట‌లు కూడా మెప్పించ‌వు. ఒక‌రి మీద ఒక‌రు ప‌గ ప‌ట్ట‌డం, ఒక‌రి కెరీర్ల‌ను మ‌రొక‌రు నాశ‌నం చేసుకోవాల‌నుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌న్నీ తేలిపోయాయి. ఎక్క‌డా డెప్త్ క‌నిపించ‌దు. ఇద్ద‌రిలోనూ ఉన్న క‌సి క‌నిపించ‌దు. అమ్మాయి ల‌క్ష‌ణాల‌తో శ్రీనివాస‌రెడ్డి, అబ్బాయి ల‌క్ష‌ణాల‌తో సిద్ధి బాగా న‌టించారు.

స‌త్యం రాజేశ్ ప్ర‌వ‌ర్తించే విధానం స‌హ‌జంగా ఉంటుంది. హ‌రితేజ పాత్ర బావుంది. వెన్నెల కిశోర్ త‌న ప‌రిధిలో బాగా న‌టించారు. చాలా సంద‌ర్భాల్లో కామెడీ న‌వ్వించ‌లేక‌పోయింది. పాట‌లు ఎప్పుడొస్తాయో, ఎందుకొస్తాయో అన్న‌ట్టు ఉన్నాయి. అమ్మాయిల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడేట‌ప్పుడు సున్నితంగా, హ‌ద్దుమీర‌కుండా తెర‌కెక్కించిన విధానం బావుంది. మ‌లుపులు, కొత్త‌ద‌నం ఏమీ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు బోర్ ఫీల‌వుతారు. స‌ర‌దాగా ఒక‌సారి చూడొచ్చు.

విడుదల తేది:22/06/2018
రేటింగ్: 2.25/5
నటీనటులు: శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని
సంగీతం: గోపీసుంద‌ర్
నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్
ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను).

- Advertisement -