తమిళనాడులో జల్లికట్టుకి అనుకూలంగా నినాదాలు హోరందుకున్నాయి. సుప్రీంకోర్టు వద్దని చెప్పిన, రాజకీయ పార్టీలు, సినీ సెలబ్రిటీలూ సంప్రదాయ క్రీడ జల్లికట్టుని నిషేధించడం తగదంటూ తెగేసి చెబుతున్నారు. మరోవైపు జల్లికట్టు పేరుతో జంతువుల్ని హింసించడమేంటని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వివాదం కోర్టు మెట్లక్కడం.. జల్లికట్టుపై నిషేధం విధించడం జరిగిపోయాయి.
అయితే వివాదంలోకి తాజాగా హీరోయిన్ త్రిష పేరు ఎక్కింది. ‘పెటా’ సంస్థ తరఫున త్రిష పలు జంతు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. జంతువుల్ని హింసించడం అన్యాయం, అక్రమం.. అంటూ త్రిష తాజాగా నినదించడంతో ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ‘పెటా ప్రచారకర్త, నటి త్రిష.. ఇక లేరు’ ఓ భయంకర వ్యాధి బారిన పడి త్రిష గత గురువారం నాడు కన్నుమూసిందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రకటించడం సంచలనమైంది. సోషల్ మీడియాలో తనను చంపేసిన వైనాన్ని, సంబంధిత ఫొటోను స్వయంగా త్రిషయే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
దీనిపై త్రిష స్పందిస్తూ…జల్లికట్టుకు వ్యతిరేకంగా నేను ఒక్క మాటా మాట్లాడలేదు. కానీ కొందరు నన్ను టార్గెట్ చేసి ఈపని చేశారు. ఇది బాధాకరం. సులువుగా పోస్ట్ చేసే అవకాశం ఉన్నంత మాత్రన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాస్తారా? మహిళలను, ఆమె ఫ్యామిలీని అవమానించడం, బాధపెట్టడమేనా తమిళ సంసృతి?’ అని దురభిమానులపై త్రిష మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసేవారికి తమిళ సంప్రదాయం గురించి మాట్లాడే అర్హత లేదని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు నటి త్రిష.
హిందీ సినిమా ‘ఎన్‌హెచ్–10’కు రీమేక్ అయిన ‘గర్జన’లో త్రిష నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మధురైకి సమీపంలోని కారైకుడి డౌన్టౌన్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఆందోళనకారులు అడ్డుకుని త్రిషకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. త్రిష చనిపోయిందంటూ నెటిజన్లు ప్రకటించడం ఆమె అభిమానులను మాత్రం కలవరానికి గురిచేసింది.