భారత్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ సోమవారం (మార్చి 9) ప్రారంభమైంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ లోక్‌సభలో ‘వెస్ట్ ఆసియా పరిస్థితి’పై కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌లో ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురైన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్ వెస్ట్ ఆసియాలోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. ఈ పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారని జైశంకర్ తెలిపారు.
ఇక లోక్‌సభలో మరో రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ఎంపీలు మహ్మద్ జావేద్, కె. సురేష్, మల్లు రవి ఈ నోటీసును సమర్పించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ స్పీకర్‌పై పక్షపాత వైఖరి ప్రదర్శించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ తీర్మానానికి 118 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినట్లు సమాచారం.
లోక్‌సభ సమావేశాలు మొదట మరణించిన మాజీ, ప్రస్తుత ఎంపీలకు సంతాపం తెలియజేస్తూ ప్రారంభమయ్యాయి. మెఘాలయ ఎంపీ రికీ ఆండ్రూ జే సింగ్కాన్‌తో పాటు కుమారి సుశీలా తిరియా, దేవి బక్స్ సింగ్, పూర్ణమాసి రామ్, కేపీ ఉన్నికృష్ణన్‌లకు నివాళులు అర్పించారు.
రాజ్యసభలో కూడా మాజీ సభ్యులు ముకుల్ రాయ్, జనార్ధన్ వాఘ్మారే, హెచ్‌కే దువాలకు నివాళులు అర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మణిపూర్‌లో అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన ప్రకటనను సభలో ప్రవేశపెట్టారు.
Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!
వెస్ట్ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో 52 వేలకుపైగా భారతీయులను ప్రభుత్వం సురక్షితంగా తరలించినట్లు సమాచారం. ఏప్రిల్ 2 వరకు కొనసాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో భద్రత, విదేశాంగ విధానం, కీలక బిల్లులపై తీవ్ర చర్చలు జరిగే అవకాశముంది.

