ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతిపై ఇచ్చిన “నేను తినను.. తిననివ్వను” అనే హామీ పూర్తిగా మోసపూరితమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం “కనీస పాలన.. గరిష్ఠ కప్పిపుచ్చుడు” మాత్రమే అందించిందని ఆయన ఆరోపించారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన జైరాం రమేష్…2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ ఇచ్చిన అవినీతి రహిత పాలన హామీ నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. 2016 నోట్ల రద్దును అప్పటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ “వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీ”గా అభివర్ణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు సంబంధించిన రూ.20 వేల కోట్ల కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు ఆ సంస్థను ఓఎన్‌జీసీలో విలీనం చేశారని జైరాం రమేష్ ఆరోపించారు. అలాగే ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ద్వారా భారీ స్థాయిలో రాజకీయ నిధుల వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని కూడా విమర్శించారు.
రాఫెల్ ఒప్పందంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లేవని, పీఎం కేర్స్ నిధి నిర్వహణలో పారదర్శకత లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కూడా అక్రమ ఖర్చులపై నివేదికలు వెలువడ్డాయని ఆయన అన్నారు.
Also Read:ఇంగ్లాండ్‌తో వన్డేలు..టీమిండియా మార్పులు!
అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులపై వచ్చిన ఆరోపణలపై కూడా జైరాం రమేష్ ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే కేంద్ర మంత్రులపై వచ్చిన ఆరోపణల విషయంలోనూ ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు.
మొత్తంగా, అవినీతి నిర్మూలన పేరిట అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం పారదర్శక పాలన అందించడంలో విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

