‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ప్రారంభించిన సీఎం..

350
cm jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. గురువారం ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్‌ కిట్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలతో పాటు మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌, బెల్ట్‌, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్‌ వంటి పలు రకాల వస్తువులని కొంద‌రు చిన్నారుల‌కు అందించారు. మొదట స్కూల్లో నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను ప్రేమగా, ఆప్యాయంగా పలకరించి.. కాసేపు ముట్చడించారు సీఎం జగన్.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు కిట్‌ను అందించనున్నారు. ప్రతి స్కూల్‌లో మూడు రోజుల పాటు ఈ పంపిణీ కొనసాగనుంది. యూనిఫారాలను క్లాత్ రూపంలో ఇచ్చినందున.. వాటి కుట్టు కూలీ కోసం రూ.120 చొప్పున మూడు జతల డబ్బులను తల్లి అకౌంట్‌లో జమజేస్తారు. స్కూల్ కిట్ వస్తువుల నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీపడలేదు. రివర్స్ టెండరింగ్, ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో కిట్లను సేకరించారు. రూ. 650 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమం చేపట్టింది ఏపీ ప్రభుత్వం.

సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలని, చదువే విద్యార్థులకు ఒక శక్తి అని చెప్పారు. పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారని, స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌పై గత ప్రభుత్వం ఆలోచించలేదని విమ‌ర్శించా‌రు. ఇంగ్లిషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయని ఆయ‌న తెలిపారు. పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టామ‌ని జ‌గ‌న్ చెప్పారు. వ‌చ్చేనెల 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామ‌ని తెలిపారు.