డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్. వచ్చేఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని లేఖలో కోరారు జగన్.
లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా నియోజకవర్గాల పున:ర్విభజన కసరత్తును నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 1971 నుంచి 2011 మధ్య 40 సంవత్సరాల కాలంలో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల కాలంలో ఈ వాటా మరింత తగ్గింది. దీనికి కారణం. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపును దక్షిణాది రాష్ట్రాలు చిత్తశుద్ధితో అమలు చేయడం కారణంగా జనాభా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పున:ర్విభజన ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలి. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరియైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటానని మోదీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.
Also Read:SSC పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించలేరా!