ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖలోని శారదపీఠానికి వెళ్లనున్నారు జగన్. మంగళవారం విశాఖ వెళ్లనున్న జగన్.. స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జగన్ శారదపీఠంలోనే ఉండనున్నారు.
జగన్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు స్వామి స్వరూపానందేంద్ర స్వామి. ఆధ్యాత్మికంగా యాగాలు నిర్వహించడంతో పాటు జగన్‌కు హితబోద చేశారు. జగన్ గెలుపు కోసం రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పలుమార్లు శారదపీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ ఏ పని మొదలుపెట్టిన ముహుర్తం పెట్టేది శారదాపీఠాదిపతే. అంతేగాదు జగన్ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖరారు చేసింది స్వరూపానందేంద్ర స్వామీజీనే.
దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ నాయకుల హడావిడితో శారదా పీఠం సందడిగా మారింది. స్వరూపానందేంద్ర సరస్వతి దర్శనానికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు బారులుతీరుతున్నారు. విశాఖ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు ఇతర జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు తరలివస్తున్నారు.