విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన వారు, అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని చెప్పారు. మల్టీ నేషనల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని సీఎం జగన్ అన్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించామని చెప్పారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా వేశామని… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని జగన్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, కానీ అలా జరగలేదని తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఆ
స్పత్రుల్లో వెంటిలేటర్ మీద ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ఎల్‌జీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు సీఎం జగన్.