కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోటిన్నర రూపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలని అధికారులు వేసిన ప్రశ్నలకు రేవంత్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. బంగారు నగలపైనా బిల్లులు చూపాలని అధికారులు అడగ్గా, అవి తమ పూర్వీకుల నుంచి వచ్చినవని రేవంత్ కుటుంబీకులు సమాధానం ఇచ్చినట్టు అనధికార వర్గాల సమాచారం.
ఇక రేవంత్‌రెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు శుక్రవారం కూడా మరో టీం సోదాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు, కంపెనీలు సహా మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రేవంత్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లాకర్లలో కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా… ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై బ్లాక్‌మనీ, ఐటీ, మనీ లాండరింగ్, ఫెమా, బినామీ లావాదేవీల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి వియ్యంకుడిపై ఐటీ ఉచ్చు బిగుస్తోంది. అలాగే రూ.15 కోట్ల యంత్రానికి 75 కోట్ల రుణం పొందడమేగాక రైతుల పేరుతో రుణాలు తీసుకున్నారని, ఇందుకు వియ్యంకుడి కంపెనీ నుంచి రేవంత్‌కు పోర్షే కారు బహుమతిగా అందిందని ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అక్రమ మార్గాల ద్వారా రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల వరకూ ఆస్తులు కూడబెట్టారని ఆదాయ పన్ను శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా, భూములు ‘కొనుగోలు’ చేసి ఆదాయాన్ని చూపించకపోవడం, కొన్ని ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం, అఫిడవిట్లలో స్పష్టత లేకపోవడం తదితర కారణాలతో ఐటీ విభాగం లోతుగా ఆరా తీసింది. రేవంత్‌కు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని, తద్వారా, కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించింది. అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.