రిమోట్ సెన్సింగ్, మ్యాపింగ్‌లకు సంబంధించి మరింత శక్తివంతమైన భూపరిశీలక ఉపగ్రహం కార్టోశాట్-2ఈని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. భారత రక్షణ అవసరాలకు అత్యంత కీలకమైన ఉపగ్రహం ఇది. గతసంవత్సరం నియంత్రణ రేఖకు అవతల ఉన్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపేందుకు కార్టోశాట్ ఉపగ్రహం పంపిన చిత్రాలనే ఆధారంగా చేసుకున్నారు. ఇప్పుడు అంతకన్నా శక్తిమంతమైన కెమెరాలు కలిగిన కార్టోశాట్-2ఈ అప్పుడే పని ప్రారంభించింది.
భారత్‌కు ఆకాశంలో ఆరో నేత్రంగా అభివర్ణిస్తున్న ఈ శాటిలైట్ జూన్ 26న అంతరిక్షం నుంచి భారత్‌తో పాటు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల ఛాయాచిత్రాలను తీసి పంపింన ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో గల కొత్త రైల్వే స్టేషన్, ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా పట్టణం, ఖతార్‌లోని దోహాకు సంబంధించిన ఛాయా చిత్రాలు ఉన్నాయి.గగనతలం నుంచి అత్యధిక నాణ్యతతో కూడిన చిత్రాలను తీసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. సైన్యం, వివిధ నిర్మాణాల ప్రణాళిక కోసం ఈ ఉపగ్రహాన్ని వినియోగించనున్నారు. గతంలో ప్రయోగించిన ఉపగ్రహాల మాదిరిగానే కార్టోశాట్-2 సైతం రిమోట్ సెన్సింగ్ విధానంలో పనిచేస్తుంది.