భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రో మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ఉదయం 10.24 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగికెగిసిన పీఎస్‌ఎల్‌వీ 51 వాహకనౌక అనుకున్న పని పూర్తి చేసింది. అనుకున్న సమయానికే రోదసిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.
అన్ని దశల్లోనూ రాకెట్ పనితీరు సవ్యంగానే ఉందని, బూస్టర్లు, ఉపగ్రహాలు సజావుగా విడివడ్డాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. కాగా, ఈసారి ప్రయోగానికి ఓ ప్రత్యేకత ఉంది. బ్రెజిల్ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి మార్కస్ క్వాంటస్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోట వచ్చారు. విదేశీ అతిథి సమక్షంలో పీఎస్‌ఎల్‌వీ 51 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.
కాగా, ఈసారి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో బ్రెజిల్ కు చెందిన అమెజానియా-1 కూడా ఉంది. దీనిపై శివన్ మాట్లాడుతూ, బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన మొదటి ప్రయోగం సఫలం కావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.
పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్ దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను, భగవద్గీత కాపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, పేరు, ఆత్మనిర్భర్ మిషన్ పేరు సహా 25 వేల పేర్లను నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో విదేశాలకు చెందిన వెయ్యి మంది, చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లు సైతం ఉన్నాయి. అమోజోనియా-1, మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూపర్యవేక్షణకు అమోజోనియా-1 శాటిలైట్ కీలకం కానుంది.